శబరిమల యాత్రకు వెళ్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కీలక విజ్ఞప్తి చేశాయి. పవిత్రమైన పంబా నదిలో స్నానమాచరించిన అనంతరం భక్తులు తమ దుస్తులను నదిలోనే వదిలివేయవద్దని కోరాయి. ఈ విషయమై భక్తులలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు (సీఎస్) బోర్డు అధికారికంగా లేఖలు రాసింది. 

వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పంబా నదిలో స్నానం చేసిన తర్వాత భక్తులు తాము ధరించిన సంప్రదాయ దుస్తులను నదిలోనే విడిచిపెడుతుండటంతో తీవ్రమైన నదీ కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. "పంబా నదిలో దుస్తులు వదిలేయాలనే నిబంధన ఏ శాస్త్రంలోనూ, అయ్యప్ప పూజా విధానంలోనూ లేదు" అని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. 

కొందరు గురుస్వాములు చెప్పే మాటలు విని భక్తులు ఇలా చేస్తున్నారని, దీనివల్ల పవిత్రమైన నదిలో వైరస్‌లు వ్యాపించి నీరు కలుషితమవుతోందని బోర్డు ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులు విడిచిపెట్టే దుస్తులు వందల ట్రక్కుల కొద్దీ పేరుకుపోతున్నాయని, వాటిని తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి పెను భారంగా మారుతోందని వివరించారు. ఈ ఏడాది శబరిమల యాత్రను ‘క్లీన్ శబరిమల, పవిత్ర శబరిమల’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంబా నది పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు.