PA-915: డిప్రెషన్‌ చికిత్సలో కొత్త ఆశలు.. ఒక్క డోసుతో దీర్ఘకాలిక ఉపశమనం!

New Hope for Depression PA 915 Offers Fast Long Lasting Relief
షార్ట్స్‌లో చూడండి
డిప్రెషన్ (కుంగుబాటు) చికిత్సలో శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. కేవలం ఒక్క డోసుతోనే వేగంగా, దీర్ఘకాలికంగా పనిచేసే ఒక కొత్త ఔషధాన్ని జపాన్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పీఏ-915 అని పిలిచే ఈ చిన్న మాలిక్యూల్.. ఒత్తిడి వల్ల కలిగే డిప్రెషన్ లక్షణాలను సమర్థవంతంగా తగ్గించినట్టు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో రుజువైంది. ఇది డిప్రెషన్‌తో బాధపడుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు రేపుతోంది.

ఒసాకా, టొయామా, హిరోషిమా, కగోషిమా విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌కు గురైన ఎలుకలకు పీఏ-915 ఔషధాన్ని ఒక్కసారి ఇవ్వగా, వాటిలో ఆందోళన, కుంగుబాటు ప్రవర్తన, జ్ఞాపకశక్తి సమస్యలు వేగంగా మెరుగుపడినట్లు గమనించారు. ముఖ్యంగా, ఒక్క డోసు ఇచ్చిన తర్వాత దాని ప్రభావం సుమారు 8 వారాల పాటు కొనసాగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీడిప్రెసెంట్ మందులు పనిచేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా, కొందరిలో అవి సరిగ్గా పనిచేయకపోగా, దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే, పీఏ-915 ఔషధం మెదడులోని పీఏసీ1 అనే నిర్దిష్ట రిసెప్టార్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఇది ఒత్తిడికి గురైన ఎలుకల్లో మెదడులోని నాడీ కణాల పనితీరును (డెండ్రైటిక్ స్పైన్ డెన్సిటీ) మెరుగుపరిచినట్టు పరిశోధనలో తేలింది.

ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలాంటి ఒత్తిడి లేని సాధారణ ఎలుకలకు ఈ మందు ఇచ్చినప్పుడు వాటి ప్రవర్తనలో ఎటువంటి అసాధారణ మార్పులు కనిపించలేదు. దీన్నిబట్టి ఈ ఔషధం కేవలం డిప్రెషన్ లక్షణాలపైనే పనిచేస్తుందని, ప్రస్తుత మందులతో పోలిస్తే చాలా సురక్షితమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు "మాలిక్యులర్ సైకియాట్రీ" అనే అమెరికన్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది డిప్రెషన్‌కు సురక్షితమైన, వేగవంతమైన, దీర్ఘకాలిక చికిత్సల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
PA-915
Depression treatment
New drug
Mental health
Antidepressant
Osaka University
Molecular Psychiatry
Stress relief
Anxiety treatment
Brain health

More Telugu News