టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తండ్రి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి, అభిమానుల పట్ల తనకున్న గౌరవం గురించి మనసు విప్పి మాట్లాడాడు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోహిత్, అభిమానుల మనసు గెలుచుకునేలా వ్యాఖ్యలు చేశాడు.

ఈ కార్యక్రమంలో సుభాష్ అనే కంటెస్టెంట్, "మీరు క్రికెట్ ఆడుతూనే తండ్రి అయ్యారు కదా. క్రికెట్ మీకు తండ్రిగా ఏం నేర్పించింది?" అని రోహిత్‌ను ప్రశ్నించారు. దీనికి రోహిత్ సమాధానమిస్తూ, "క్రికెట్ ఆడేటప్పుడు కోపం రావడం సహజం. కానీ, ఇంటికి వెళ్లాక మాత్రం ఒకటి రెండు నిమిషాల్లోనే నా కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ మార్పు నాన్న అయ్యాకే నాలో వచ్చింది. సహనాన్ని నేను తండ్రి అయ్యాకే నేర్చుకున్నాను" అని తెలిపాడు.

ఈ సంభాషణ సందర్భంగా, కంటెస్టెంట్ సుభాష్ ఒక పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు. "సార్, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఉన్నారు. నేను మీ వెనకే ఉన్నాను. అప్పుడు మీరు ఒక దివ్యాంగ అభిమానితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చూశాను. ఆరోజు మిమ్మల్ని కలవలేకపోయాను, కానీ ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మిమ్మల్ని కలవడానికే వచ్చాను" అని చెప్పారు.

ఈ మాట వినగానే రోహిత్ వెంటనే ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు. "అవును, నాకు బాగా గుర్తుంది. అతను టీమిండియాకు చాలా పెద్ద అభిమాని. చాలా మ్యాచ్‌లకు వస్తుంటాడు. అలాంటి స్థితిలో కూడా జట్టును ప్రోత్సహించడానికి వచ్చినప్పుడు, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి మా సమయం నుంచి ఓ రెండు నిమిషాలు కేటాయించలేమా?" అంటూ తన ఉదారతను చాటుకున్నాడు. 

అభిమానుల గురించి రోహిత్ మాట్లాడుతూ.. "అభిమానులు లేకపోతే ఈ ఆటే లేదు. స్టేడియానికి వచ్చే ప్రతీ అభిమానికి మేం ఎంతో గౌరవం ఇస్తాం. ఎందుకంటే, వాళ్లు ఎన్ని కష్టాలు పడి మ్యాచ్ చూడటానికి వస్తారో నాకు తెలుసు. రైళ్లలో ప్రయాణించి, రద్దీలో ఇబ్బందులు పడి వస్తుంటారు. స్టేడియంలోకి వెళితే వేలాది మంది ఉంటారు, కొన్నిసార్లు కూర్చోవడానికి సీటు కూడా దొరకదు. అయినా గంటల తరబడి అలాగే ఉంటారు. ముఖ్యంగా ఇండియాలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వేడిలో కూర్చుని మ్యాచ్ చూసే వారి డెడికేషన్‌కు మేం ఎంతో విలువిస్తాం" అని వివరించాడు. రోహిత్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.