తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల ఏర్పాట్ల పురోగతిపై క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

యువతలో నూతన ఉత్సాహం నింపేలా డిసెంబర్ 11న ఖేలో ఇండియా పోటీలను అత్యంత అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రారంభ వేడుకలను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో, ముగింపు వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతటా క్రీడా వాతావరణం, క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. స్టేడియంల పునరుద్ధరణ, క్రీడా ప్రాంగణాల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, పనులపై విజిలెన్స్ నిఘా ఉంచాలని ఆదేశించారు.

ఈ భారీ క్రీడా ఈవెంట్ ప్రారంభ, ముగింపు వేడుకల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించనున్నారు. పోటీలు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ జరుగుతున్నందున, జిల్లాల వారీగా మంత్రులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ యుద్ధ కళ 'కర్రసాము' ఈ పోటీల్లో తొలిసారిగా ప్రదర్శన క్రీడగా అడుగుపెడుతుండటం విశేషం. ఈ సందర్భంగా కర్రసాము ప్రత్యేక బ్రోచర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జాతీయ వేదికపై కర్రసాముకు తగిన గుర్తింపు కల్పించడం వల్ల ఈ ప్రాచీన కళకు, స్థానిక క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెలాఖరు నాటికి స్టేడియాల మరమ్మతులు, మౌలిక వసతుల పనులతో పాటు 27 క్రీడలకు అవసరమైన అత్యాధునిక క్రీడా పరికరాలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోటీలు నిర్వహించే మొత్తం ప్రాంగణాల్లో ఇప్పటికే 14 స్టేడియాలలో పనులు పూర్తికాగా, మిగిలిన 6 చోట్ల నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన 1,334 మంది అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు అవసరమైన అధునాతన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతమైన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 203 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 21 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేవలం స్టేడియాల ఆధునీకరణ, అంతర్జాతీయ స్థాయి పరికరాల కొనుగోలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 120 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో తెలంగాణ అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక కావాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ఈ క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారు.
20261125fr443bf7c4e02b.jpg20261125fr69d4d5bff903.jpg