కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన డీలిమిటేషన్ బిల్లు మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో తీవ్ర విభేదాలకు దారితీసింది. ఈ బిల్లు విషయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) వైఖరిపై శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రతిపాదనకు ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు పలకడం మహారాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని ఆయన ఆరోపించారు.

లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే లక్ష్యంతో కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును సిద్ధం చేసింది. దీనిపై ఎంవీఏ మిత్రపక్షాలైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అయితే, డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, శరద్ పవార్‌తో చర్చించాకే దీనికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత జితేంద్ర అవ్హాడ్ పేర్కొన్నారు.

మరోవైపు, అధికారిక ముసాయిదా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లను సమతుల్యంగా పెంచాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తెలిపారు. ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. శరద్ పవార్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, శారీరకంగా లేదా మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో ఆయన లేరని వ్యాఖ్యానించారు.

బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు ఒక్కో ఎంపీకి రూ. 150 కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. 

కాగా, గత రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్దతుతోనే పవార్ గెలిచారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ విభేదాల క్రమంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి ఎన్సీపీ (ఎస్పీ) నేతలు హాజరుకాలేదు. ఈ పరిణామాలు విపక్ష కూటమి భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.