దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషించడం తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రయాణమని ప్రముఖ నటి సాయిపల్లవి తెలిపారు. ఈ పాత్ర చేసిన తర్వాత తనలో వ్యక్తిగతంగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘వి ది ఉమెన్’ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో జరిగిన ముఖాముఖిలో సాయిపల్లవి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సీత పాత్ర తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే అంశంపై సాయిపల్లవి స్పందిస్తూ.. ‘‘నా జీవితం ఎప్పుడూ ఒక సినిమా నుంచి మరో సినిమాతో ముందుకు వెళుతూనే ఉంటుంది. అయితే, ప్రతీ పాత్ర వల్ల మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలాగే, సీత పాత్రతో నాలో కొన్ని వ్యక్తిగతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. అవి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా కావు’’ అని అన్నారు.

అదే సమయంలో సీత లుక్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలపైనా ఆమె నిర్మొహమాటంగా స్పందించారు. ‘‘సోషల్‌ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకోవద్దు. సీతమ్మ పాత్రపై విమర్శలు నా దృష్టికి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అభిప్రాయాలుగానే చూడాలి. వాటిని ఎదుర్కొని మరింత బలంగా మారాలి. ధైర్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు, ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లొచ్చు. కేవలం అందానికే పరిమితమయ్యే పాత్రలు నాకు ఇష్టం ఉండదు. అలాంటి పాత్రలను నేను ఎంచుకోను. ఆ నిర్ణయమే సరైన దారి చూపిస్తుంది’’ అని సాయిపల్లవి స్పష్టం చేశారు. బాహ్య విమర్శలు మన అంతరంగాన్ని ప్రభావితం చేయకూడదని, లోపల బలంగా ఉన్నప్పుడే అనవసర శబ్దాలను పక్కనపెట్టి ముందుకు సాగగలమని ఆమె పేర్కొన్నారు.