మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధన కోసం ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాంచందర్ రావు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.

పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా దేశంలో మహిళలకు విద్యావకాశాలతో పాటు, వారికి రాజకీయ అభ్యున్నతి కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ప్రతిపక్షాలు ఆ ప్రక్రియను అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కకుండా విపక్షాలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

అలాగే, భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 175కి, లోక్‌సభ స్థానాలు 25కి పెరిగే అవకాశముందని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూలే మార్గంలోనే దేశాభివృద్ధి ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.