రవాణా రంగంలో చైనా మరో అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. రెక్కలు గానీ, టేకాఫ్ కోసం రన్‌వే గానీ అవసరం లేకుండా నిలువుగా గాల్లోకి ఎగరగల సరికొత్త ఫ్లయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. చైనాలోని చాంగ్షా నగరంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వాహనం తొలి ప్రయోగాత్మక పరీక్షను పూర్తి చేసుకుంది. అచ్చం ఒక కాంపాక్ట్ కారులా కనిపించే ఈ వాహనం, నిలువుగా గాల్లోకి లేవడం, గాలిలో నిలకడగా ఉండటం (హోవర్), తిరిగి అదే ప్రదేశంలో సురక్షితంగా కిందకు దిగడం వంటి విన్యాసాలను ప్రదర్శించింది.

ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత్‌లో చైనా రాయబారి జు ఫెయిహాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో పంచుకున్నారు. ఈ వీడియోలో ఫ్లయింగ్ కార్ ఒక సాధారణ రోడ్డుపై నుంచి రన్‌వే అవసరం లేకుండానే నేరుగా పైకి లేవడం స్పష్టంగా కనిపిస్తుంది. గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టి, తన స్థానాన్ని మార్చుకుని, ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దిగింది. 

ఈ సందర్భంగా జు ఫెయిహాంగ్ మాట్లాడుతూ.. "చైనాలో తయారైన రెక్కలు లేని ఫ్లయింగ్ కార్ తొలి ప్రయాణాన్ని పూర్తి చేసింది. 280 కిలోల టేకాఫ్ బరువు, 120 కిలోల పేలోడ్ సామర్థ్యంతో ఇది రన్‌వే లేకుండానే గాల్లోకి లేస్తుంది. దీనిలో బ్లేడ్లు బయటకు కనిపించకుండా ఎన్‌క్లోజ్డ్ ఫ్యాన్ డిజైన్ ఉండటం వల్ల నగరాల్లో ప్రయాణాలు సురక్షితంగా మారతాయి" అని పేర్కొన్నారు.

టెక్నాలజీలో ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా డ్రోన్లు లేదా హెలికాప్టర్లలో బయటకు కనిపించే ప్రొపెల్లర్లు ఉంటాయి. కానీ, చైనా అభివృద్ధి చేసిన ఈ ఫ్లయింగ్ కారులో 'మల్టీ-స్టేజ్ థ్రస్ట్-వెక్టరింగ్ డక్టెడ్ ఫ్యాన్ సిస్టమ్' అనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. అంటే.. గాలిని అత్యంత వేగంగా నెట్టే ఫ్యాన్లు వాహనం లోపల సురక్షితంగా అమర్చి ఉంటాయి. ఇది వాహనం గాల్లోకి లేవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. బ్లేడ్లు బయటకు కనిపించకపోవడం వల్ల తక్కువ ఎత్తులో, ముఖ్యంగా జనసాంద్రత అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు భద్రతాపరమైన ముప్పు తగ్గుతుంది.

టెస్లా రోడ్‌స్టర్‌కు, దీనికి తేడా ఏంటి?
ఫ్లయింగ్ కార్ల అభివృద్ధిలో టెస్లా కూడా ప్రయోగాలు చేస్తోంది. అయితే, చైనా టెక్నాలజీకి, టెస్లా రోడ్‌స్టర్ టెక్నాలజీకి మధ్య చాలా తేడా ఉంది. టెస్లా తన రోడ్‌స్టర్ కారు కోసం స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన 'కోల్డ్-గ్యాస్ ఎయిర్ థ్రస్టర్లను' ఉపయోగించాలని యోచిస్తోంది. 

ఇవి కారును గాల్లోకి లేపి, కొద్దిసేపు మాత్రమే కదిలేలా చేసి, అత్యధిక వేగాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. కానీ, చైనా వాహనం నిలువుగా టేకాఫ్ అయి గాల్లో స్థిరంగా ప్రయాణించగలదు. రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా గాల్లో ప్రయాణించే వాహనాల తయారీలో ఈ రెండు భిన్నమైన ఇంజినీరింగ్ విధానాలను సూచిస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం చైనా పరీక్షించింది ఒకే ఒక్కరు కూర్చోగల ప్రోటోటైప్ మాత్రమేనని నిపుణులు గుర్తు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ, వాణిజ్యపరంగా ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇది సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఇది భవిష్యత్ పట్టణ రవాణా వ్యవస్థకు ఒక బలమైన పునాది వేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.