ప్రముఖ ఇంటర్నెట్ స్ట్రీమర్, కంటెంట్ క్రియేటర్ ఐషోస్పీడ్ (IShowSpeed) తన అసాధారణ పరుగు వేగంతో క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఒక ప్రత్యేక శిక్షణా ఛాలెంజ్‌లో భాగంగా అతడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 10.352 సెకన్లలోనే పూర్తి చేశాడు. స్ప్రింటింగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిన ఈ పరుగు, ప్రపంచ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌తో పాటు నెటిజన్లను సైతం ఆకట్టుకుంది.

ఈ ఛాలెంజ్‌లో ఐషోస్పీడ్ తన మొదటి ప్రయత్నంలో 100 మీటర్ల దూరాన్ని 10.50 సెకన్లలో పూర్తి చేశాడు. ఆ వెంటనే రెండో ప్రయత్నంలో మరింత వేగం పుంజుకుని, సమయాన్ని 10.35 సెకన్లకు తగ్గించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ అనూహ్య ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసిన తోటి స్ట్రీమర్ ఏజెంట్00 (Agent00) షాక్‌కు గురై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన ఉసేన్ బోల్ట్, ఐషోస్పీడ్ పరుగును చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఐషో స్పీడ్ పరుగు తీసిన విధానం, రన్నింగ్ టెక్నిక్, ఆఖరి వరకు వేగాన్ని కొనసాగించిన తీరును బోల్ట్ ప్రత్యేకంగా అభినందించాడు. అయితే, ఈ సమయం అధికారికంగా గుర్తింపు పొందిన అథ్లెటిక్స్ పోటీలలో నమోదు కాలేదని, ఒక ప్రత్యేక ట్రైనింగ్ ఛాలెంజ్‌లో భాగంగానే జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

2009లో ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 100 మీటర్ల ప్రపంచ రికార్డు సమయం 9.58 సెకన్లు కాగా, ఐషోస్పీడ్ నమోదు చేసిన సమయం దానికి కేవలం 0.77 సెకన్ల దూరంలో మాత్రమే ఉండటం విశేషం. వృత్తిరీత్యా అథ్లెట్ కాకపోయినప్పటికీ, ఒక స్ట్రీమర్ ఇంత తక్కువ సమయంలో 100 మీటర్లు పూర్తి చేయడం నిజంగా విశేషమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ అనూహ్య ప్రదర్శన ఇచ్చిన ఉత్సాహంతో, ఐషోస్పీడ్ భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్ప్రింటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని యోచిస్తున్నాడు. 2028లో అమెరికా వేదికగా జరగనున్న లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలనే తన ఆకాంక్షను అతడు ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు.