తండ్రి ఓ సాధారణ కూలీ. కన్న కలలను నిజం చేసేందుకు కష్టాలనే ఇష్టంగా మార్చుకున్నాడు. ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి మరీ పిల్లలను చదివించాడు. ఆ తండ్రి త్యాగానికి, తల్లి ప్రోత్సాహానికి ప్రతిఫలంగా ఇద్దరు కొడుకులు ఒకరు డాక్టర్, మరొకరు ఇంజనీర్‌గా మారి ఆయన కష్టాన్ని గెలిపించారు. బిహార్‌కు చెందిన ఈ సోదరుల స్ఫూర్తిదాయక విజయగాథ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

బిహార్‌లోని గయకు చెందిన మనోజ్ కుమార్ ధాన్యం మార్కెట్‌లో బస్తాలు మోసే కూలీగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లేవారు. తన ఇద్దరు కుమారులు సోనూ రాజ్, మోనూ రాజ్‌లను ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. వారి కోరిక మేరకు వారిని ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం రాజస్థాన్‌లోని కోటాకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తమకున్న చిన్న వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని అమ్మేశారు.

తండ్రి త్యాగాన్ని వృథా చేయకుండా ఆ సోదరులు పట్టుదలతో చదివారు. కోటాలోని అలెన్ ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్ల శిక్షణ తర్వాత అద్భుతమైన ఫలితాలు సాధించారు. పెద్ద కుమారుడు సోనూ రాజ్ నీట్ యూజీ 2026 పరీక్షలో 636 మార్కులు సాధించి, ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు.

చిన్న కుమారుడు మోనూ రాజ్, జేఈఈ మెయిన్ 2026లో 93 పర్సంటైల్ సాధించి, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఐటీ), మెస్రాలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో ప్రవేశం దక్కించుకున్నాడు. అయితే, కోటాలో చదువుతున్న సమయంలో మోనూ టైఫాయిడ్, కామెర్ల బారిన పడి సుమారు మూడు నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. అయినప్పటికీ, పట్టుదల వీడకుండా చదువు కొనసాగించి విజయం సాధించడం విశేషం.

ఈ సందర్భంగా సోదరులు మాట్లాడుతూ, "మా తల్లిదండ్రులు మా కోసం ఎంతో చేశారు. వారి త్యాగాలకు ఇది చిన్న ప్రతిఫలం. ఇప్పుడు వారికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు. తమ తల్లిదండ్రులు గర్వపడేలా సమాజానికి సేవ చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.