గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2018లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ఒకరి సంస్కృతి సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతీయ పండుగలైన దీపావళి పూజలు, కర్వా చౌత్ వేడుకల నుంచి ప్రియాంక సోదరుడి పెళ్లి సంప్రదాయాల వరకు నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకోవడం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ సంగీతాన్ని కూడా ఆయన అమితంగా ఇష్టపడతారు. భారతీయ సంప్రదాయాలతో ఆయనకున్న అనుబంధాన్ని చూసి అభిమానులు నిక్ జోనాస్‌ను ప్రేమగా 'నేషనల్ జీజు' (బావ గారు) అని పిలుచుకుంటారు.

ఇటీవల ప్రముఖ టాక్ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4లో పాల్గొన్న ప్రియాంక చోప్రా, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన, నవ్వులు పూయించే సంఘటనను పంచుకున్నారు. నిక్ జోనాస్ మొదటిసారి మన భారతీయ డైజెస్టివ్ ట్యాబ్లెట్ 'హాజ్మోలా' రుచి చూసినప్పుడు ఎలా స్పందించారో ఆమె షోలో గుర్తుచేసుకున్నారు. ఒక అమెరికన్‌కు హాజ్మోలా తినిపిస్తే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవాలని షో హోస్ట్ కపిల్ శర్మతో ప్రియాంక సరదాగా అన్నారు. "మీరు నిజంగానే ఆయనకు హాజ్మోలా తినిపించారా?" అని కపిల్ ఆశ్చర్యంగా ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ప్రియాంక తమ ఇంట్లోని విశేషాలను వెల్లడించారు. తన ఇంట్లో ఆమ్‌పాపడ్, హాజ్మోలా వంటి వివిధ రకాల చట్‌పటా భారతీయ స్నాక్స్ దాచుకోవడానికి ప్రత్యేకంగా ఒక కప్ బోర్డ్ ఉందని ఆమె తెలిపారు. ఒకసారి అందులో ఏముందో తెలుసుకోవడానికి నిక్ చాలా ఆసక్తి చూపించాడని చెప్పారు. అప్పుడు తాను జోక్యం చేసుకుంటూ.. "నువ్వు దీనికి కొంచెం దూరంగా ఉండు.. ఇది నీకు అర్థం కాదు" అని చెప్పినట్లు ప్రియాంక వివరించారు.

అయినప్పటికీ, దాని రుచి ఎలా ఉంటుందో చూడాలన్న నిక్ కుతూహలాన్ని చూసి ఆమె ఆయనకు ఒక హాజ్మోలా ఇచ్చారు. అయితే, ఆ మాత్రను నోట్లో వేసుకున్న వెంటనే నిక్ ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. ఆ ఘాటైన వాసన, రుచి చూసిన వెంటనే నిక్ ఆశ్చర్యపోతూ చాలా విచిత్రమైన, ఫన్నీ కామెంట్ చేశారు. "దీని నుంచి ఇలాంటి వాసన ఎందుకు వస్తోంది?" అంటూ ఆయన అమాయకంగా అడిగిన తీరు తనను ఎంతగానో నవ్వించిందని ప్రియాంక పేర్కొన్నారు. కపిల్ శర్మ షోలో ప్రియాంక పంచుకున్న ఈ సరదా జ్ఞాపకం ప్రస్తుతం నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.