భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని స్వదేశానికి తరలించింది. గత సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో 60.08 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ చర్యతో దేశీయంగా నిల్వ ఉంచిన బంగారం వాటా గణనీయంగా పెరిగింది.

ఆర్బీఐ విడుదల చేసిన అర్ధ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి నాటికి దేశంలో 680.05 టన్నులుగా ఉన్న పసిడి నిల్వలు, సెప్టెంబర్ నాటికి 740.13 టన్నులకు చేరాయి. దీంతో ఆర్బీఐ మొత్తం బంగారం నిల్వల్లో దేశీయంగా ఉన్న వాటా 77.23% నుంచి సుమారు 84%కి పెరిగింది. 

ఆర్బీఐ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉండగా.. అందులో ఎలాంటి మార్పు లేదు. కేవలం విదేశాల్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, 'బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్' (బీఐఎస్‌) వంటి సంస్థల వద్ద ఉన్న నిల్వలు 197.67 టన్నుల నుంచి 140.39 టన్నులకు తగ్గాయి.

అదే సమయంలో, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో పసిడి నిల్వల విలువ 115.40 బిలియన్ డాలర్ల నుంచి 106.08 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు, భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్) సెప్టెంబర్ చివరి నాటికి 737.78 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 'విదేశీ కరెన్సీ ఆస్తులను' (ఎఫ్‌సీఏ) కూడా సెక్యూరిటీలలోకి ఎక్కువగా మళ్లించినట్లు నివేదిక పేర్కొంది.