ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగిన వివాహాల వేడుకల్లో పెళ్లికొడుకులకు వేసిన కరెన్సీ నోట్ల దండలు చూసి స్థానికులు, బంధువులు విస్తుపోయారు. ఏకంగా రూ. 500 నోట్లతో అల్లిన ఒక్కొక్కటి 100 అడుగుల పొడవైన దండలను పెళ్లిళ్లకు కానుకగా అందించారు. ఒక్కో దండ విలువ ఏకంగా రూ.1 కోటి వరకు ఉంటుందని అంచనా. ఈ అసాధారణ కానుకను వారి బావ (రాజస్థాన్‌కు చెందిన సర్పంచ్) ప్రత్యేకంగా చేయించి తీసుకురాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

మథుర పరిధిలోని నగ్లా ఫోండా గ్రామానికి చెందిన దాయాదులు ప్రశాంత్, కాన్హా రాఘవ్‌లకు గోవర్ధన్‌లోని ముడ్సేరస్ గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలతో వివాహం నిశ్చయమైంది. ఈ వేడుకల్లో భాగంగా రాజస్థాన్‌కు చెందిన ఒక గ్రామ సర్పంచ్.. పెళ్లికొడుకులిద్దరికీ భారీ కరెన్సీ దండలను బహూకరించారు. వంద అడుగుల పొడవు, భారీ బరువు ఉన్న ఆ నోట్ల దండలను మోయడానికి, నిర్వహించడానికి పదుల సంఖ్యలో మనుషులు అవసరమయ్యారు.

దండలు చాలా భారీగా ఉండటంతో ఇద్దరు పెళ్లికొడుకులను మేడపై నిలబెట్టి, ఆ రూఫ్‌టాప్ నుంచి మెడలో వేయాల్సి వచ్చింది. మేడ పైనుంచి కింది నేల వరకు సాగిన ఆ కరెన్సీ దండల దృశ్యాలను చూసి గ్రామస్థులు, బంధువులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పలువురు ఈ అరుదైన దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.