తాను చేయించుకున్న సర్జరీలో భాగంగా ముఖం నుంచి తొలగించిన ఎముకల ముక్కలతో ఓ మహిళ ప్రత్యేకమైన చెవిపోగులు తయారు చేయించుకున్నారు. ఈ వినూత్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆబ్రే అనే ట్రాన్స్‌జెండర్ మహిళ, తన లింగ మార్పిడి ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ (ఎఫ్ఎఫ్ఎస్‌) చేయించుకున్నారు. స్త్రీ లక్షణాలకు అనుగుణంగా ముఖ కవళికలను మార్చేందుకు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో భాగంగా ముఖంలోని ఎముకలు, మృదు కణజాలాల్లో మార్పులు చేస్తారు.

ఈ సర్జరీ సమయంలో, తన ముఖంలోని పలు భాగాల నుంచి తొలగించిన చిన్న ఎముక ముక్కలను భద్రపరచాలని ఆబ్రే తన వైద్య బృందాన్ని కోరారు. ఇందుకు వారు అంగీకరించడంతో, ఆ ఎముకలను ఆమె సేకరించారు. అనంతరం, రెడ్డిట్ ద్వారా ఓ ఆభరణాల తయారీ నిపుణుడిని సంప్రదించారు. ఆ ఎముక శకలాలను వైట్-గోల్డ్ ఫ్రేమ్‌లో పొదిగి, జిర్కోనియా రాళ్లతో అందమైన చెవిపోగులుగా తయారు చేయించారు.

ఈ ఆభరణాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆబ్రే వివరిస్తూ.. "ఇవి కేవలం చెవిపోగులు మాత్రమే కాదు. నాకు తీవ్రమైన అసంతృప్తి (డిస్ఫోరియా) కలిగించిన భాగాలను తొలగించుకోవడం ద్వారా నాలో నేను సౌందర్యాన్ని కనుగొన్నాను. అలా తొలగించిన వాటిని తిరిగి అందమైన వస్తువుగా మార్చుకోవడంలోనూ ఓ అందాన్ని చూస్తున్నాను" అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన వద్ద ఇంకా కొన్ని ఎముక ముక్కలు ఉన్నాయని, వాటితో భవిష్యత్తులో ఒక నెక్లెస్ కూడా తయారు చేయించుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆమె చెప్పారు.

ఆబ్రే సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కథపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె సృజనాత్మకతను, దాని వెనుక ఉన్న వ్యక్తిగత ప్రాముఖ్యతను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ వింత ఆలోచన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తనకు బాధ కలిగించిన వస్తువులనే ఆనందానికి ప్రతీకగా మార్చుకున్న ఆబ్రే కథ చాలామందిని ఆకట్టుకుంటోంది.