పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును మార్చేందుకు అక్కడి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆంగ్ల నామమైన ‘వెస్ట్ బెంగాల్’ స్థానంలో బెంగాలీ పేరైన ‘పశ్చిమ్ బంగా’ను అధికారికంగా ఖరారు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 9న అసెంబ్లీలో అధికారిక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు.

కోల్‌కతాలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం సీఎం వివరాలు వెల్లడించారు. "ఇకపై ఆంగ్లంలో కూడా రాష్ట్రాన్ని 'పశ్చిమ్ బంగా' అనే పిలుస్తారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని డిసెంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెడతాం. సభ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటరీ, చట్టపరమైన ప్రక్రియల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం" అని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఈ పేరు మార్పు వెనుక బలమైన పాలనాపరమైన కారణం కూడా ఉంది. ప్రస్తుత పేరు ఆంగ్ల అక్షరమాల ప్రకారం ‘W’ (West Bengal)తో ప్రారంభమవుతోంది. దీనివల్ల జాతీయ స్థాయి సమావేశాలు, ముఖ్యమంత్రుల సదస్సులలో బెంగాల్ ప్రతినిధులకు చివరి వరుసలో మాట్లాడే అవకాశం వస్తోంది. దీనివల్ల సమయం సరిపోక రాష్ట్ర వాణిని బలంగా వినిపించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించి, ఆల్ఫాబెటికల్ జాబితాలో ముందు వరుసలోకి వచ్చేలా ‘P’తో మొదలయ్యేలా ‘పశ్చిమ బంగా’ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ సవరణ కోసం కేంద్ర ఆమోదానికి పంపనున్నారు.