ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పేలుడు పదార్థాలు తయారు చేసి, ఓ ప్రభుత్వ విద్యాసంస్థపై దాడికి ప్రణాళిక రచించాడన్న ఆరోపణలతో పాకిస్థాన్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్‌కు చెందిన ఈ విద్యార్థి, ప్రముఖ ఏఐ చాట్‌బాట్ ‘క్లాడ్ ఏఐ’తో జరిపిన సంభాషణల ఆధారంగా ఈ కుట్ర వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇచ్చిన పక్కా సమాచారంతో పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు.

లాహోర్‌లోని ఓ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి, ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన ‘క్లాడ్ ఏఐ’తో పేలుడు పదార్థాల తయారీ గురించి ఆరా తీశాడు. ఓ పెద్ద భవనాన్ని ధ్వంసం చేసేందుకు అవసరమైన రసాయనాలను ఎలా కలపాలనే దానిపై వివరాలు అడిగాడు. అంతేకాకుండా, ఓ ప్రభుత్వ విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకుని, కాఫీ తాగుతూ దాడి చేయాలనే తన ఉద్దేశాన్ని కూడా ఏఐ చాట్‌లో పంచుకున్నాడు.

ఈ ప్రమాదకర సంభాషణలను గుర్తించిన ఆంత్రోపిక్ సంస్థ వెంటనే అమెరికా ఎఫ్‌బీఐని అప్రమత్తం చేసింది. ఎఫ్‌బీఐ అధికారులు ఈ సమాచారాన్ని పాకిస్థాన్‌లోని నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎన్‌సీసీఐఏ) అందించారు. దీంతో రంగంలోకి దిగిన పాక్ అధికారులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

అతడి నివాసం నుంచి ఏఐతో చాట్ చేయడానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రమాదకర సంభాషణలకు సంబంధించిన డేటా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, ఇంట్లో ఎటువంటి పేలుడు పదార్థాలు గానీ, ఆయుధాలు గానీ లభించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ (పీఈసీఏ), పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మానసిక పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ కుట్ర వెనుక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.