నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ భారీ దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా పూజా కార్యక్రమాలను రేపు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో లాంఛనంగా నిర్వహించనున్నారు. అదే రోజున సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక సినిమా ప్రారంభోత్సవాన్ని అయోధ్య రామ మందిర ప్రాంగణంలో నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని మేకర్స్ తెలిపారు. 

భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించి, పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రాంతీయ పరిశ్రమల నుంచి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను తీసుకోనున్నారు.

ఈ చిత్రానికి రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం వంటి అంశాలతో పాటు భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. 

బలమైన కథ, అగ్రశ్రేణి తారాగణం, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఇది మూడో ప్రతిష్ఠాత్మక చిత్రం కావడం గమనార్హం.