ప్రైవేట్ వాహనాలపై కులాన్ని సూచించే పేర్లు, గుర్తులు, చిహ్నాలు లేదా రాతలను ప్రదర్శించడాన్ని గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. సమాజంలో కుల అస్తిత్వాన్ని వాహనాల ద్వారా చాటుకునే ధోరణిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 'గుజరాత్ మోటార్ వాహనాల (మూడో సవరణ) నియమావళి 2026' పేరుతో అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. పాత 'గుజరాత్ మోటార్ వెహికల్ రూల్స్, 1989' నియమాలకు సవరణలు చేస్తూ ఈ నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ నూతన నిబంధనలు రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు మొదలుకొని కార్లు, బస్సులు, ట్రక్కుల వరకు ఏ వాహనంపైనా కుల సంబంధిత పేర్లు, స్టిక్కర్లు, చిహ్నాలు లేదా చిత్రాలను ప్రదర్శించడానికి వీల్లేదు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు మోటార్ వాహనాల నియమావళిలోని నిబంధన 125(1)లో మార్పులు చేస్తూ "కుల సూచిక చిహ్నాలు" (caste signage) అనే అంశాన్ని చేర్చారు. అలాగే నిబంధన 138లో కొత్తగా ఉప-నిబంధన (3)ని పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ముందస్తు అనుమతి ఇచ్చిన సందర్భాల్లో మినహా, సాధారణంగా ఏ ప్రైవేట్ వాహనంపైనా కుల గుర్తుల ప్రదర్శన ఉండకూడదని ఈ సవరణ స్పష్టం చేస్తోంది.

ఈ నిబంధనల అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందస్తు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసింది. సవరణ ముసాయిదాను 2026 జూన్ 11న రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ గెజిట్‌లో ప్రచురించింది. దీనిపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే నిర్దిష్ట గడువు ముగిసేవరకు ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో, 2026 నవంబర్ 17న తుది నియమావళిని అధికారికంగా నోటిఫై చేసింది.

ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలను క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రవాణా శాఖ సమాయత్తమవుతోంది. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాంతీయ రవాణా అధికారులు (RTO), పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇకపై తనిఖీల్లో వాహనాలపై కుల చిహ్నాలు కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.