ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌, కోడలు నారా బ్రాహ్మణి తమ ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాధ్యత గల ప్రతి పౌరుడూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన నాయకులను ఎన్నుకుంటేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఓటు వేసినప్పుడే ప్రజలకు ఎన్నుకున్న ప్రతినిధులను ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్లు డబ్బుకు ఆశపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో రెండో విడత పురపాలక ఎన్నికల్లో భాగంగా నేడు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో 26 జిల్లాల్లో వేలాది గ్రామ పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల దశల్లో అధికార టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంచి ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే.