జమ్మూకశ్మీర్‌ను చలి వణికిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంత వ్యాప్తంగా కనిష్ఠ‌ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇవాళ‌ శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా మైనస్ 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం డిసెంబర్ 3 వరకు జమ్మూకశ్మీర్‌లో పొడి వాతావరణమే కొనసాగనుంది. రాత్రిపూట ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అధికారులు తెలిపారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలైన పహల్గామ్‌లో మైనస్ 3.6 డిగ్రీలు, గుల్మార్గ్‌లో సున్నా డిగ్రీల కనిష్ఠ‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్ము నగరంలో 9.8, కత్రాలో 10.2, భదర్వాలో 3.2 డిగ్రీలుగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

పొడి వాతావరణం, గాలిలో కాలుష్య కారకాలు పెరగడం వల్ల శ్రీనగర్‌లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. వర్షం లేదా మంచు కురిస్తే గాలి నాణ్యత మెరుగుపడుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, చలి తీవ్రత పెరగడంతో స్థానికులు తమ సంప్రదాయ శీతాకాలపు వస్త్రమైన 'ఫెరాన్' ధరించడం ప్రారంభించారు.

చలి తీవ్రతను బట్టి పాఠశాలలకు శీతాకాలపు సెలవులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రాథమికంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ముందుగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. లోయలో కూరగాయలు, మటన్, చికెన్, గ్యాస్ సిలిండర్లతో పాటు ఇతర నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదని, శీతాకాలానికి సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.