దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తోటి ఉద్యోగులే ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి సహకరించిన ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఉన్న సల్తనేట్‌ కేఫ్‌లో 22 ఏళ్ల బాధితురాలు, నిందితులు కలిసి పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి కేఫ్ మూసివేసిన తర్వాత సిబ్బంది అంతా కలిసి అక్కడే పార్టీ చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు కేఫ్ మూసేసినప్పటికీ, ఉద్యోగుల వద్ద తాళాలు ఉండటంతో లోపలే ఉండిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు మద్యం తాగుతూ, డ్యాన్సులు చేస్తూ గడిపారు.

ఈ సమయంలో ఇద్దరు పురుష ఉద్యోగులు యువతిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. మిగతా సహోద్యోగులు నేరానికి సహకరిస్తూ నిందితులకు అండగా నిలిచారు. అనంతరం బాధితురాలు మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేఫ్ నుంచి యువతి మరో పురుష మిత్రుడు, ఇద్దరు మహిళలతో కలిసి వాహనంలో వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్న పోలీసులు, మేజిస్ట్రేట్ ముందు కూడా ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.