బంగారం, వెండి ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చన్న ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో మంగళవారం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ విలువైన లోహాల ధరలు కుప్పకూలాయి. గురునానక్ జయంతి సందర్భంగా ఉదయం ట్రేడింగ్ జరగకపోగా, సాయంత్రం సెషన్‌లో మాత్రమే ట్రేడింగ్ జరిగింది.

మంగళవారం రాత్రి సమయానికి ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.3,508 (2.78 శాతం) తగ్గి రూ.1,22,488 వద్ద ట్రేడైంది. ఇక వెండి ఫ్యూచర్స్ ధర మరింత దారుణంగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.8,817 (5.72 శాతం) తగ్గి రూ.1,45,400 కు చేరింది.  కేంద్ర బ్యాంకుల కఠిన వడ్డీ విధానాల వల్ల బంగారం ధరలు నిలకడ సాధించలేకపోతున్నాయని మార్కెట్ నిపుణుడు ఫవాద్ రజాక్‌జాదా పేర్కొన్నారు. 

హోల్‌సేల్ మార్కెట్లో ధరలు భారీగా పతనమైనప్పటికీ, హైదరాబాద్ నగరంలో రిటైల్ నగల ధరలు మాత్రం ఇంకా గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి. నగరంలోని తనిష్క్ షోరూమ్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,650 (10 గ్రాములకు రూ.1,16,500)గా ఉంది. ఇక కల్యాణ్ జువెలర్స్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, జాయ్ అలుక్కాస్ షోరూమ్‌లలో గ్రాము రూ.11,715 (10 గ్రాములకు రూ.1,17,150) వద్ద ట్రేడవుతోంది. జీఆర్టీ జువెలర్స్‌లోనూ దాదాపు ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ రేట్లకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని, మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.