భారత సైనిక సమాచార వ్యవస్థలో సరికొత్త విప్లవానికి హైదరాబాద్‌ బిట్స్ పిలానీ విద్యార్థి శ్రీకారం చుట్టాడు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి సమర్థ్ అలోక్ శ్రీవాస్తవ, తన స్టార్టప్ 'క్రాత్‌వీల్ ప్రైవేట్ లిమిటెడ్' (Krathveil Private Limited) ద్వారా సైన్యం కోసం అత్యాధునిక స్వదేశీ కమ్యూనికేషన్ పరికరాన్ని అభివృద్ధి చేశాడు. దీనికి 'క్రాత్ కంట్రోల్' (Krath Control) అని పేరు పెట్టాడు.

'క్రాత్ కంట్రోల్' అనేది జేబులో సులభంగా ఇమిడిపోయే, పూర్తి ఎన్‌క్రిప్టెడ్ మెష్-రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ. దీని బరువు కేవలం 180 గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. ఎలాంటి మొబైల్ టవర్లు, సిమ్ కార్డులు లేదా శాటిలైట్ నెట్‌వర్క్ ఆధారపడకుండానే ఇది పనిచేయడం దీని ప్రత్యేకత. సరిహద్దుల్లో, అటవీ ప్రాంతాల్లో సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవడానికి, మ్యాప్‌లు మరియు ఇతర కీలక సమాచార డేటాను వేగంగా మార్పిడి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ పరికరంలో అత్యంత కీలకమైన 'సెల్ఫ్-హీలింగ్ నెట్‌వర్క్' సాంకేతికతను జోడించారు. ఒకవేళ ఆపరేషన్ సమయంలో ఏదైనా ఒక డివైస్ పాడైపోయినా లేదా నెట్‌వర్క్ కోల్పోయినా, మొత్తం వ్యవస్థ ఆగిపోదు. వెంటనే నెట్‌వర్క్ స్వయంచాలకంగా వేరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొని సమాచార ప్రసారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తుంది. అత్యవసర మిలిటరీ ఆపరేషన్లలో ఈ ఫీచర్ సైనికులకు ఎంతగానో రక్షణగా నిలుస్తుంది.

ఈ వ్యవస్థ ద్వారా సైన్యానికి భారీగా ఖర్చు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థల ఖర్చు యూనిట్‌కు సుమారు రూ.2 లక్షల వరకు ఉంటోంది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'క్రాత్ కంట్రోల్' పరికరం కేవలం రూ.40,000 నుంచి రూ.50,000 లోపే అందుబాటులోకి రానుంది.

సమర్థ్ అభివృద్ధి చేసిన ఈ డివైస్‌ను ఇప్పటికే భారత సైన్యంలోని రెండు యూనిట్లతో పాటు ఆర్మీ డిఫెన్స్ కాలేజీ ముందు విజయవంతంగా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రోటోటైప్ దశలో ఉందని, త్వరలోనే అధికారిక ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకుని భారత సైన్యంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన టెక్నాలజీని సైన్యానికి అందించేందుకు ఒక భారతీయ విద్యార్థి చేసిన ఈ ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.