వారాల తరబడి కొనసాగుతున్న తీవ్ర నిరసనలు, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కనీస నెలసరి వేతనాన్ని 36 శాతం పెంచుతూ నేడు ప్రకటించింది. దీంతో వారి కనీస వేతనం 12,500 టాకాల నుంచి 17,000 టాకాలకు (భారత కరెన్సీలో సుమారు రూ. 12,865) చేరింది. అయితే, గత దశాబ్ద కాలంలో చూస్తే ఇదే అత్యంత తక్కువ వేతన పెంపు కావడం గమనార్హం.

గత కొన్ని వారాలుగా తమ జీతాలను రెట్టింపు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారి ఫ్యాక్టరీలు మూతపడటం, జాతీయ రహదారుల దిగ్బంధం, పోలీసులతో ఘర్షణలకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన వేతన బోర్డు రంగంలోకి దిగింది. 

కార్మికులు, యాజమాన్యాల ప్రతినిధులతో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులున్న బోర్డులో నలుగురు సభ్యులు 17,000 టాకాలకు మద్దతివ్వగా, ఇద్దరు సభ్యులు కార్మికుల డిమాండ్ అయిన 18,000 టాకాలకు అనుకూలంగా ఓటు వేశారు.

కొత్త వేతనాల విధానంలో మొత్తం నాలుగు గ్రేడ్‌లు ఉంటాయి. దీని ప్రకారం గ్రేడ్-4 కార్మికులకు కనీస వేతనం 17,000 టాకాలుగా, గ్రేడ్-1 కార్మికులకు 21,500 టాకాలుగా నెల జీతం లభిస్తుంది. ఈ కొత్త వేతనాలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా, 2027 జనవరి నుంచి కార్మికులు పెరిగిన జీతాలు అందుకోనున్నారు. అయితే, కార్మికులు మొదట తమ వేతనాన్ని 32,000 టాకాలకు పెంచాలని డిమాండ్ చేసి, ఆ తర్వాత 18,000 టాకాలకు తగ్గించుకున్నారు. 

మరోవైపు, ఫ్యాక్టరీ యజమానులు మొదట 15,000 టాకాలు ఆఫర్ చేసి, చివరికి 17,000 టాకాలకు అంగీకరించారు. జీతాలు ఇంకా పెంచితే ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని కోల్పోతామని ఫ్యాక్టరీ యజమానులు వాదిస్తున్నారు.

ఈ ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. 'బంగ్లాదేశ్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్' (బీజీఎంఈఏ) సర్వే ప్రకారం 18 రోజుల నిరసనల వల్ల సుమారు 317 ఫ్యాక్టరీలలో 428 మిలియన్ డాలర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. 

అంతేకాకుండా, అంతర్జాతీయ కొనుగోలుదారులు సుమారు 254 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను ఇతర దేశాలకు తరలించినట్లు తేలింది. ప్రభుత్వం వేతనాలు పెంచినప్పటికీ, కార్మికుల డిమాండ్‌కు ఇది చాలా తక్కువగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా సద్దుమణుగుతాయా లేదా అన్నది అనుమానంగానే ఉంది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80శాతం వాటా ఉన్న ఈ పరిశ్రమలో 40 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. హెచ్‌&ఏం, జారా, వాల్‌మార్ట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు బంగ్లాదేశ్ ప్రధాన సరఫరాదారుగా ఉంది.