న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై చెలరేగిన వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్‌ను ఇలాంటి అనవసర వివాదాల్లోకి లాగడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగియడంతో సిరాజ్ లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సహా పలువురు దీనిపై రాజకీయ, వివక్ష కోణాలను లేవనెత్తడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ క్రమంలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ... "సిరాజ్ ఆడకపోవడం వల్లే టెస్ట్ మ్యాచ్ డ్రా అయిందని చెప్పడం సరైంది కాదు. సిరాజ్‌ను ఇలాంటి వివాదాల్లోకి లాగకూడదు. అతడు ఇప్పటికే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే పిచ్ పరిస్థితులు, ఇతర సమీకరణాలను బట్టి తుది 11 మందిలో ఎవరిని ఆడించాలనేది పూర్తిగా కెప్టెన్, ప్రధాన కోచ్ తీసుకునే నిర్ణయం. కేవలం తుది జట్టులో చోటు దక్కలేదని రాజకీయ వివాదాలు సృష్టించడం సరికాదు. ఇది సిరాజ్‌కు కూడా మంచిది కాదు" అని పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 720/9 వద్ద డిక్లేర్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 239/5 స్కోరు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.