శివపార్వతుల చిత్రానికి గల లోతైన తాత్విక అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తూ హిందూ ధర్మ ఆచార్య సభ ప్రధాన కార్యదర్శి స్వామి పరమాత్మానంద సరస్వతి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శివపార్వతుల చిత్రానికి సంబంధించి ఆయన ఈ వివరణ ఇచ్చారు. పరమశివుడి ఒడిలో పార్వతీదేవి కూర్చున్న సంప్రదాయ చిత్రణ కేవలం ఒక సాధారణ దృశ్యం కాదని, దాని వెనుక ఉపనిషత్తులు, శాస్త్రాలు బోధించిన పరమోన్నత జ్ఞానం దాగి ఉందని పేర్కొన్నారు.

తాను చూసిన ఆ చిత్రం ద్వారా రాహుల్ ఏం చెప్పాలనుకున్నారో తనకు తెలియదని, అయితే సనాతన ధర్మంలోని అంతరార్థాన్ని తెలియజేయడానికే ఈ లేఖ రాస్తున్నానని స్వామి పరమాత్మానంద చెప్పారు. నిరాకారమైన, నిర్గుణమైన బ్రహ్మమే సృష్టి, స్థితి, లయకారకమైన శక్తులను మేల్కొలిపినప్పుడు ఈశ్వరుడిగా (శివుడిగా) మారుతుందని వివరించారు. శివుడు శక్తిమంతుడైతే, పార్వతీదేవి సృష్టికి మూలమైన 'శక్తి' లేదా 'మాయ' అని తెలిపారు. శక్తిమంతుడైన శివుడిని విడిచి శక్తికి స్వతంత్ర అస్తిత్వం ఉండదని, ఉమామహేశ్వరుల రూపం లేదా అర్ధనారీశ్వర రూపం ఈ తత్వాన్నే లోకానికి తెలియజేస్తాయని స్పష్టం చేశారు. సనాతన ధర్మంలోని పవిత్ర చిత్రాలను బాహ్య దృష్టితో కాకుండా, అవి బోధించే అంతర్గత సత్యాన్ని గురు-శిష్య పరంపర ద్వారానే గ్రహించగలమని ఆయన హితవు పలికారు.

ఇటీవల సోనియా గాంధీ, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీల దాంపత్యంపై జరిగిన రాజకీయ చర్చల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు. భయం, కోపం, ద్వేషం ఉన్నవారు ప్రేమను అనుభవించలేరంటూ బీజేపీ, ఆరెస్సెస్‌లను విమర్శిస్తూ ఆయన 'ఎక్స్' వేదికగా ఆ ఫోటోను పంచుకున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో స్వామి పరమాత్మానంద రాసిన ఈ తాత్విక లేఖ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.