ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను విధ్వంసకర శక్తుల చేతుల్లోకి వెళ్లినా లేదా నియంత్రణ కోల్పోయినా దాన్ని ఆపడానికి ఎలాంటి 'కిల్ స్విచ్' (ఎమర్జెన్సీ షట్‌డౌన్) పనిచేయదని ఓపెన్‌ఏఐ మాజీ బోర్డు సభ్యురాలు హెలెన్ టోనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జార్జ్‌టౌన్ వర్సిటీకి చెందిన భద్రతా నిపుణురాలైన ఆమె ఏఐ ముప్పు తీవ్రతను వివరించారు.

ఒక్క కిల్ స్విచ్‌తో అన్ని సమస్యలనూ పరిష్కరించడం అసాధ్యమని టోనర్ స్పష్టం చేశారు. కొన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో వేర్వేరు స్థాయుల్లో షట్‌డౌన్ లేదా ఓవర్‌రైడ్ వ్యవస్థలు ఉపయోగపడతాయేమో కానీ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వ్యవస్థలను పూర్తిగా ఆపలేవని తెలిపారు. అమెరికా పరిధికి ఆవల, పూర్తి స్వయంప్రతిపత్తితో నడిచే కంప్యూటింగ్ వ్యవస్థలపై పనిచేసే ఏఐలను నియంత్రించడం ఎవరి వల్లా కాదని పేర్కొన్నారు. చైనా పోటీని బూచిగా చూపిస్తూ అత్యంత ప్రమాదకరమైన ఏఐ టెక్నాలజీని గుడ్డిగా అభివృద్ధి చేసుకుంటూ పోవడం ఆత్మహత్యాసదృశ్యమని అభిప్రాయపడ్డారు.

మరోవైపు 'ఏఐ గాడ్‌ఫాదర్'గా పేరొందిన జెఫ్రీ హింటన్ సైతం ఏఐ ముప్పుపై తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో విద్యుత్ లేదా ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసేలా ఏఐ వల్ల 'చెర్నోబిల్' తరహా పెను విపత్తు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఏడాది లేదా రెండేళ్లలోనే ఇలాంటి దుర్ఘటన జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన రిస్కులు ఉంటాయని తెలిసినప్పటికీ ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, శామ్ ఆల్ట్‌మన్ వంటి దిగ్గజాలు లాభాల కోసం పోటీపడుతున్నారని హింటన్ విమర్శించారు. ఏఐ చాట్‌బాట్లు సొంత భాషను అభివృద్ధి చేసుకుంటే నియంత్రణ పూర్తిగా చేజారిపోతుందని తేల్చిచెప్పారు.