వివాహ ఆహ్వాన పత్రికలపై వధూవరుల పేర్లు, వారి తల్లిదండ్రుల వివరాలు ఉండటం సర్వసాధారణం. అయితే బీహార్‌కు చెందిన మోకామా ఎమ్మెల్యే అనంతసింగ్ తన చిన్న కుమార్తె వివాహ పత్రికలో చూపించిన వైవిధ్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పత్రికలో వరుడి పేరు పక్కనే అతడు అమెరికాలో చదివిన మాస్టర్స్ డిగ్రీని ప్రత్యేకంగా ముద్రించడం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చనీయాంశంగా మారింది.

ఇండియా టుడే కథనం ప్రకారం.. మోకామా ఎమ్మెల్యే అనంతసింగ్ చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహం బుధవారం (నవంబర్ 25, 2026) జరగనుంది. ఈ పెళ్లి కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో వరుడు రిషికేష్ కుమార్ పేరు పక్కనే "MBA, Georgia State University, Atlanta, USA" అని బ్రాకెట్లలో స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా పెళ్లికొడుకు పేరు పక్కన విద్యార్హత వరకు రాస్తుంటారు. కానీ అనంత్ సింగ్ తన అల్లుడి విషయంలో, అతడు ఎక్కడ చదివాడో కూడా రాయడం విశేషం.

వధువు శివాంగి సింగ్ రాంచీలోని సెయింట్ బిషప్స్, పిలానీలోని బిర్లా కాలేజీలో పాఠశాల విద్యను పూర్తి చేసి, అమిటీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ముంబైలో పీజీ పూర్తి చేసింది. ఇక బీహార్‌లోని బిహ్తాకు చెందిన వరుడు రిషికేష్ కుమార్.. సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా సేవలందిస్తున్న రణవిజయ్ కుమార్, ఆశాదేవి దంపతుల కుమారుడు. అమెరికాలోని అట్లాంటా జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన రిషికేష్, దాదాపు 10 నుంచి 11 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నాడు.

ఈ పెళ్లికి సంబంధించిన భారీ ఏర్పాట్లు కూడా అంతే ఆసక్తికరంగా మారాయి. ఇటీవల జరిగిన తిలక్ వేడుకలో వరుడికి దాదాపు రూ.3 కోట్ల విలువైన తెల్లటి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహూకరించారు. దీంతో పాటు 100 గ్రాముల బంగారు గొలుసు, 80 గ్రాముల బ్రాస్‌లెట్‌ను కానుకగా ఇచ్చారు.

పెళ్లి సందడిలో భాగంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 50కి పైగా గుర్రాలతో భారీ పందెం పోటీలను ఏర్పాటు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి గుర్రపు స్వారీదారులు ఈ పందేల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో మొదటి విజేతకు బహుమతిగా సరికొత్త మహీంద్రా థార్ కారును, రెండో స్థానంలో నిలిచిన వారికి మోటార్ సైకిల్, మూడో స్థానానికి స్కూటర్‌ను అందించనున్నారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పందిళ్లు, పందెం మైదానం బురదమయమైనప్పటికీ.. ట్రాక్టర్లు, రోలర్లు, ఇసుకను ఉపయోగించి ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పందేలను నిర్వహించి తీరుతామని అనంతసింగ్ వర్గం స్పష్టం చేసింది.

విందు భోజనాల విషయానికొస్తే, ఈ వివాహానికి దాదాపు 5 లక్షల మందికి పైగా ఆహ్వానితులు తరలివచ్చే అవకాశం ఉందని సమాచారం. అతిథుల కోసం 150కి పైగా రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వంటల తయారీకి 500 మందికి పైగా వంట సిబ్బంది నిరంతరం శ్రమిస్తుండగా, పాల అవసరాల కోసం ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా పాలను తరలిస్తున్నారు.