మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. తన పిల్లను చంపేసిందన్న ఆగ్రహంతో ఓ తల్లి కుక్క, చిరుత పిల్లను దాడి చేసి చంపేసింది. ఆష్టీ తాలూకా పరిధిలోని దౌలవడ్గావ్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. దౌలవడ్గావ్ గ్రామ జనావాసాల సమీపంలోకి సోమవారం ఉదయం ఓ చిరుతపులి వచ్చింది. అక్కడ ఉన్న ఓ కుక్క పిల్లను అది చంపేసింది. అయితే అదే రోజు మధ్యాహ్నం దాదాపు 3:30 గంటల సమయంలో, తన పిల్ల చనిపోయినందుకు తల్లి శునకం ప్రతీకారం తీర్చుకుంది. అక్కడే ఉన్న చిరుత పిల్లపై ఒక్కసారిగా దాడికి దిగింది. తల్లి కుక్క తీవ్రంగా గాయపరచడంతో ఆ చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది.

ఉదయం తన పిల్లను చంపినందుకే, ప్రతీకారంతో తల్లి కుక్క చిరుత పిల్లపై దాడి చేసి ప్రాణాలు తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే అటవీ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అమోల్ ముండే ఆధ్వర్యంలో అధికారులు పంచనామా నిర్వహించారు. మృతి చెందిన చిరుత పిల్ల ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే కుక్క పిల్ల కళేబరాన్ని కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం గ్రామంలో కొన్ని కోళ్లను చంపినప్పటి నుంచి, ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఇప్పుడు ఒకే రోజులో ఈ రెండు ఘటనలు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.