ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలను టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికరంగా విశ్లేషించాడు. భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చిన తర్వాత న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను వదులుకోవడం సరైన నిర్ణయమేనని సమర్థించాడు. అయితే ఆఫ్ఘనిస్థాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను రిలీజ్ చేయడం మాత్రం తనను ఆశ్చర్యపరిచిందని జియోస్టార్‌తో మాట్లాడుతూ పఠాన్ పేర్కొన్నాడు.

విదేశీ లెఫ్టార్మ్ పేసర్ అయిన బౌల్ట్ స్థానంలో స్వదేశీ లెఫ్టార్మ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడని, ఇది విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌ను సరిదిద్దుకునేందుకు ముంబైకి ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని పఠాన్ విశ్లేషించాడు. అలాగే తరచూ గాయాలపాలవుతూ పూర్తి సీజన్లు ఆడలేకపోతున్న పేసర్ దీపక్ చాహర్‌ను రిలీజ్ చేయడం కూడా అర్థం చేసుకోదగినదేనని స్పష్టం చేశాడు. కొత్త బంతితో వికెట్లు తీసే స్పెషలిస్ట్ బౌలర్ ఇప్పటికే జట్టులో ఉన్నప్పుడు చాహర్‌ను పక్కనపెట్టడం సరైన నిర్ణయమేనన్నాడు. కానీ, మిచెల్ శాంట్నర్‌తో కలిసి ఇరువైపులా విదేశీ స్పిన్ దాడి చేసేందుకు అల్లా ఘజన్‌ఫర్ సరైన ప్రత్యామ్నాయంగా ఉండేవాడని, అతడిని వదులుకోవడమే ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు.

ఈ మార్పులు చేసినప్పటికీ ముంబై బౌలింగ్ విభాగం ఇప్పటికే అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారీ పర్స్ బ్యాలెన్స్‌తో వేలానికి వెళుతున్న ఐదుసార్లు ఛాంపియన్ ముంబై.. ఎప్పటిలాగే ఊహించని కొత్త టాలెంట్‌ను వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. పెద్ద బడ్జెట్‌తో మినీ వేలంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ముంబై ఇండియన్స్ ఏదో ఒక అద్భుతం చేస్తుందని, ఈసారి వేలంలో ఫ్రాంచైజీ ఆ నిధులను ఎలా వినియోగిస్తుందో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పఠాన్ ముగించాడు.