లక్ష్మీ పూజల పేరుతో యువతులు, బాలికలపై లైంగిక దాడికి పాల్పడి, ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ కీచక పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో నిందితుడు కమ్మర కృష్ణమాచారి (47)ని కర్ణాటక పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు కృష్ణమాచారి అనంతపురం జిల్లా ఆకతోటపల్లిలోని మహంకాళి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. బళ్లారి ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. పేద, మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా ఈ ముఠా తన కార్యకలాపాలను సాగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ధన వర్షం పేరుతో ఘరానా మోసం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి, ఇంట్లో ప్రత్యేక లక్ష్మీ పూజలు నిర్వహిస్తే ధన వర్షం కురుస్తుందని, అపార సంపద లభిస్తుందని నిందితులు నమ్మించేవారు. పూజలు విజయవంతం కావాలంటే ఎటువంటి మచ్చలు లేని, సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండే పెళ్లికాని యువతులు కావాలని నిబంధనలు పెట్టేవారు. పూజకు ముందుగా వారి కుడి చేయి, కుడి కాలి ఫొటోలను తీసుకునేవారు. అనంతరం ప్రత్యేక పూజల పేరుతో వారిపై లైంగిక దాడి చేసి, నగ్న వీడియోలు, ఫొటోలు తీసేవారు.

ఆ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ అనంతపురం, బెంగళూరు, విజయపుర వంటి ప్రాంతాల్లో వ్యభిచార కూపంలోకి నెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందికి పైగా యువతులు, బాలికలు ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు సమాచారం.

రెండు నెలల అండర్‌కవర్ ఆపరేషన్
ఈ కేసును ఛేదించేందుకు కర్ణాటకకు చెందిన ‘అక్కా ఫోర్స్’ మహిళా పోలీసులు దాదాపు రెండు నెలల పాటు అండర్‌కవర్ ఆపరేషన్ చేపట్టారు. సాధారణ మహిళల వేషంలో ఈ ముఠాలోకి ప్రవేశించి, నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. చివరికి నిందితుడు శ్రీశైలంలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వీడియోలు, ఫొటోలతో కూడిన డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.