భారత్‌లో గృహ రుణం తీసుకునే వారు బ్యాంకులు ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీలను అంగీకరించి, దాని ప్రీమియంను కూడా లోన్ మొత్తంలో కలిపితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విధానం వల్ల, అసలు ప్రీమియం కన్నా దాదాపు రెట్టింపు మొత్తాన్ని వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. లోన్ కాలపరిమితి ఎక్కువగా ఉండటంతో, చిన్న ప్రీమియం మొత్తం కూడా దీర్ఘకాలంలో పెద్ద భారంగా మారుతోంది.

ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ.2 లక్షల సింగిల్ ప్రీమియం పాలసీని తీసుకుని, దానిని 8.5% వడ్డీ రేటుతో 20 ఏళ్ల హోం లోన్‌లో కలిపారనుకుందాం. లోన్ కాలపరిమితి పూర్తయ్యేసరికి, కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం అదనంగా రూ.4.15 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంటే.. అసలు ప్రీమియం ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువవుతుంది. వాస్తవానికి, హోం లోన్ పొందడానికి లైఫ్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చట్ట ప్రకారం తప్పనిసరి కాదు. 

బ్యాంకులు తమ రుణ షరతుగా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని కస్టమర్లను బలవంతం చేయకూడదు. కేవలం ఆస్తికి అగ్ని ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మాత్రమే కొన్నిసార్లు తప్పనిసరి చేస్తారు. అయితే, ఆ పాలసీని కూడా కస్టమర్ తనకు నచ్చిన ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచైనా తీసుకునే స్వేచ్ఛ ఉంది.

లోన్‌తో కలిపి ఇన్సూరెన్స్ తీసుకోవడం కన్నా, విడిగా ఒక సాధారణ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఆటోమ్ రిస్క్ అడ్వైజరీ ఇండియా హెడ్ వినోద్ కామత్ సూచించారు. బ్యాంకులు ఆఫర్ చేసే లోన్‌-లింక్డ్ పాలసీలలో 'రెడ్యూసింగ్ కవర్' ఉంటుంది. 

అంటే.. లోన్ బకాయి తగ్గే కొద్దీ బీమా కవరేజీ కూడా తగ్గుతుంది. ఒకవేళ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ (రీఫైనాన్స్) చేస్తే, ఈ పాలసీ బదిలీ కాకపోవచ్చు. దీనికి బదులుగా, విడిగా తీసుకునే 'లెవల్-టర్మ్' పాలసీలో బీమా మొత్తం స్థిరంగా ఉంటుంది. ఇది నామినీకి పూర్తి ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఇలాంటి పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) నిబంధనలను కఠినతరం చేస్తోంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ (సెకండ్ అమెండ్‌మెంట్) డైరెక్షన్స్-2026' ప్రకారం, ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా అమ్మడాన్ని 'మిస్-సెల్లింగ్'గా పరిగణిస్తారు. 

దీనికి బ్యాంకులు కస్టమర్ నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. ఒకవేళ మిస్-సెల్లింగ్ రుజువైతే, బ్యాంకులు పూర్తి ప్రీమియంను వాపసు చేయడంతో పాటు జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

కాబట్టి, హోం లోన్ తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇన్సూరెన్స్ తప్పనిసరా కాదా అని బ్యాంకును రాతపూర్వకంగా అడగాలి. ప్రీమియంను లోన్‌లో కలపకుండా విడిగా చెల్లించే మార్గాలను అన్వేషించాలి. వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాలి. లోన్ పంపిణీ అయ్యాక, ఊహించని కోతలు ఏమైనా ఉన్నాయేమో స్టేట్‌మెంట్‌లో సరిచూసుకోవాలి. పాలసీ జారీ అయిన 30 రోజుల 'ఫ్రీ-లుక్' వ్యవధిలో నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, నచ్చకపోతే రద్దు చేసుకోవచ్చు.