ఎటు చూసినా ఎర్రటి తివాచీ పరిచినట్లుండే అరుదైన దృశ్యం మరోసారి ఆవిష్కృతమైంది. ఆస్ట్రేలియాకు చెందిన మారుమూల క్రిస్మస్ ద్వీపంలో దాదాపు 10 కోట్ల ఎర్ర పీతలు సముద్రం వైపు తమ వార్షిక ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో అడవుల నుంచి సముద్ర తీరానికి గుడ్లు పెట్టేందుకు ఇవి కదులుతున్నాయని పర్యావరణ పరిరక్షణ అధికారులు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీలు, వంతెనల మీదుగా సాగే ఈ మహా వలసను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈ పీతల వలస కాలం చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి దాటిన చివరి త్రైమాసికంలో, తెల్లవారుజామున ఆటుపోట్ల సమయంలో సముద్రపు నీటిలో గుడ్లు విడుదల చేసేలా ఇవి సమయాన్ని ఎంచుకుంటాయి. ఇండోనేషియాకు దక్షిణంగా 350 కిలోమీటర్లు, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 1,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న 135 చదరపు కిలోమీటర్ల ఈ చిన్న ద్వీపంలో పీతల ప్రయాణానికి అధికారులు నెలల తరబడి ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. రోడ్లపై ప్రత్యేక బ్రిడ్జిలు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి పీతలకు రక్షణ కల్పిస్తారు.

ఒకప్పుడు ఈ ఎర్ర పీతలకు ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ (పిచ్చి చీమలు) నుంచి తీవ్ర ముప్పు వాటిల్లింది. చీమలు వీటి బొరియలను ఆక్రమించడంతో కోట్ల సంఖ్యలో పీతలు చనిపోయి, జనాభా 5 కోట్లకు పడిపోయింది. అధికారులు చేపట్టిన నిరంతర రక్షణ చర్యల వల్ల చీమల బెడద తగ్గి, పీతల సంఖ్య ఇప్పుడు రెట్టింపై 10 కోట్లకు చేరింది. క్రిస్మస్ ద్వీప అటవీ వ్యవస్థను కాపాడటంలో ఈ పీతలే కీలకమని, వీటి సంఖ్య పెరగడం ద్వీప పర్యావరణ సమతుల్యతకు ఎంతో మేలు చేస్తుందని నేషనల్ పార్క్ మేనేజర్ క్రిస్ చార్ట్రెస్ తెలిపారు.