ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు ఉద్యోగాల కల్పన అంశాలపై వైసీపీ అధినే జగన్ కు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి అగ్రశ్రేణి సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేస్తుంటే, గత పాలకులు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారని, ఆ తర్వాత మళ్లీ ప్రాజెక్టుల క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా 2024-26 కాలానికి సంబంధించిన పారిశ్రామిక ప్రగతి వివరాలను మంత్రి పంచుకున్నారు. అందులో గూగుల్ (రూ. 1,33,000 కోట్లు), ఏఎం/ఎన్ఎస్ ఇండియా (రూ. 1,36,000 కోట్లు), బ్రూక్‌ఫీల్డ్ (రూ. 1,06,000 కోట్లు), రిలయన్స్ (రూ. 43,000 కోట్లు), రెన్యూ, వారీ, ప్రీమియర్ ఎనర్జీస్, అల్ట్రాటెక్, దాల్మియా భారత్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, టాటా, ఐబీఎం, కాగ్నిజెంట్ తదితర సంస్థల ప్రాజెక్టులు వివిధ దశల్లో (కమిషన్డ్, నిర్మాణంలో, ఆపరేషనల్) ఉన్నట్లు ఆ జాబితాలో చూపించారు.

ఈ వివరాలను ప్రస్తావిస్తూ.. "ఇది మా ట్రాక్ రికార్డ్. పరిశ్రమల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన మరియు రాష్ట్ర అభివృద్ధిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా సవాల్‌ను స్వీకరించడానికి మీరు సిద్ధమేనా?" అంటూ జగన్‌ను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు.