రాయల్ ఎన్‌ఫీల్డ్ పాత 500సీసీ క్లాసిక్ మోడళ్లు కనుమరుగైన తర్వాత ఆ సెగ్మెంట్‌లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా సరికొత్త సంచలనానికి తెరతీసింది. సరికొత్త 'హోండా సీబీ500' బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.2.75 లక్షలుగా నిర్ణయించింది. భారీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్న ఈ మోటార్‌సైకిల్ మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. ఇప్పటికే అధికారిక బుకింగ్స్ ప్రారంభం కాగా, 2026 చివరి నాటికి డెలివరీలు పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ బైక్‌లో సరికొత్త 501సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5,250 ఆర్‌పీఎమ్ వద్ద 28 హెచ్‌పీ పవర్, 3,750 ఆర్‌పీఎమ్ వద్ద 43.3 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా నుంచి అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ ఇదే కావడం విశేషం.

స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్, ముందూ వెనుకా డ్యూయల్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందు వైపు 19 అంగుళాల వీల్, వెనుక 17 అంగుళాల వీల్‌ను అమర్చారు. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లను సస్పెన్షన్ కోసం అందించారు.

వేరియంట్ల విషయానికి వస్తే, బేస్ అల్లాయ్ మోడల్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే రంగుల్లో లభిస్తుంది. క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్స్‌తో వచ్చే మిడ్-స్పెక్ స్పోక్ వేరియంట్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ స్టీల్ సిల్వర్ మెటాలిక్ రంగులు ఉన్నాయి. ఇక ప్రత్యేకమైన రంగులు, సరికొత్త గ్రాఫిక్స్‌తో వచ్చే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.3.02 లక్షలు. ఇది స్ట్రైప్స్‌తో కూడిన సింగిల్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ కలర్‌లో లభించనుంది. 

అన్ని వేరియంట్లలోనూ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి. 189 కిలోల బరువు, 168 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రూపొందిన ఈ మోటార్‌సైకిల్ నగర ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.