ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగినికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు 24 ఏళ్లుగా కంపెనీకి సేవలందిస్తున్న లారా విలియమ్స్ అనే ఉద్యోగిని సంస్థ విధుల నుంచి తొలగించింది. ఇంజినీరింగ్ బృందాలకు ఏఐపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్న సమయంలోనే ఆమెకు ఈ లేఆఫ్ సమాచారం అందడం గమనార్హం.

లారా విలియమ్స్ మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్యుమెంటేషన్ తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో వివరిస్తూ ఆమె సహోద్యోగులకు 90 నిమిషాల శిక్షణా సెషన్ ఇస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో 'హై ప్రయారిటీ బిజినెస్ అప్‌డేట్' పేరుతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ సమావేశంలోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ చేపట్టిన అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెప్టెంబర్ 22న ఈ లేఆఫ్ జరిగింది.

ఈ విషయాన్ని లారా విలియమ్స్ లింక్డ్‌ఇన్ ద్వారా వెల్లడిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్‌లో 24 ఏళ్ల నా సుదీర్ఘ ప్రయాణానికి ఇది చాలా బలమైన ముగింపులా అనిపిస్తోంది" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సహచరులకు, మేనేజర్లకు, కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా విభాగాల పునర్వ్యవస్థీకరణ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.