ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ భారతీయ కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లు విసిరిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ ట్రక్ వద్ద ఆహారం తింటున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ వికృత చేష్టకు పాల్పడ్డారు. సిడ్నీలో నివసిస్తున్న అంజలి శర్మ అనే భారతీయ మహిళ ఈ విషయాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అంజలి శర్మ తెలిపిన వివరాల ప్రకారం... ఆమె పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొందరు పెద్దలు, వృద్ధులు ఉన్న ఒక భారతీయ కుటుంబం రోడ్డు పక్కన ఫుడ్ ట్రక్ వద్ద ప్రశాంతంగా కూర్చుని తింటున్నారు. ఆ సమయంలో అటుగా వేగంగా వెళ్లిన ఒక 'యూట్ ట్రక్' (వెనుక భాగం తెరిచి ఉండే వాహనం) నుంచి కొందరు వ్యక్తులు ఆ కుటుంబంపైకి గుడ్లు విసిరారు. వారు ఎవరి జోలికీ వెళ్లకుండా తమ పనేదో తాము చేసుకుంటున్నప్పటికీ ఈ దాడి జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"దీన్ని జాత్యహంకారం అంటారో లేక భారతీయులపై ద్వేషం అంటారో తెలియదు కానీ, ఇది చూసి నాకు చాలా బాధేసింది" అని అంజలి శర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫోన్ చేశానని, అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తనకు స్పష్టత లేదని ఆమె చెప్పారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న వివక్ష, ద్వేషపూరిత చర్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాగా, గత అక్టోబర్‌లో కూడా బ్రిస్బేన్‌లో ఒక భారతీయ కుటుంబంపై జాత్యహంకార దూషణలకు పాల్పడి, అపార్ట్‌మెంట్‌ను పేల్చేస్తామని బెదిరించిన ఘటనలో 19 ఏళ్ల హార్లే ఆడమ్స్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిడ్నీలో జరిగిన తాజా ఉదంతం ప్రవాస భారతీయుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.