లిబియా తీరంలో రష్యా నౌకాదళానికి ఉక్రెయిన్ భారీ షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌక (కార్వెట్‌) 'మెర్క్యురీ'ని ఉక్రెయిన్ బలగాలు విజయవంతంగా ముంచేశాయి. ఈ దాడి కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడు నేవల్ డ్రోన్లను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు శత్రువు ఆయుధ రవాణాకు ఉపయోగిస్తున్న 'ఎంవీ అంగారా' అనే రష్యన్ సరుకు రవాణా (కార్గో) నౌకను కూడా తాము విజయవంతంగా దెబ్బతీశామని ఆయన వెల్లడించారు.

రష్యా దురాక్రమణకు దీటుగా ఉక్రెయిన్ చేపట్టిన అత్యుత్తమ ఆపరేషన్ ఇదని జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఈ దాడిని తిప్పికొట్టేందుకు రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి ధాటికి రష్యా యుద్ధనౌక మునిగిపోయిందని తెలిపారు. ఈ 'మెర్క్యురీ' నౌక రష్యా నౌకాదళంలో అత్యంత సరికొత్తది అని, ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైన తర్వాతే 2023లో దీన్ని రష్యా సైన్యంలోకి చేర్చుకున్నారని ఆయన వివరించారు. ఈ నౌక మునిగిపోవడంతో పాటు దానిపై ఉన్న 'కేఏ-27' పోరాట హెలికాప్టర్ కూడా పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. 

ఈ క్లిష్టమైన ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్, రక్షణ బలగాల సైనికులను జెలెన్‌స్కీ అభినందించారు. నిర్దేశిత జలాల్లో తమ సైనిక చర్యలు కొనసాగుతాయని, సొంత ఆయుధాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటూ రష్యా దాడిని తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఉక్రెయిన్ భూభాగంపై తాము పెద్ద ఎత్తున ప్రతిదాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైన్యానికి చెందిన డ్రోన్ తయారీ కేంద్రాలు, నిల్వ ప్రాంతాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు తెలిపింది. రష్యన్ వార్తా సంస్థ టాస్ ప్రకారం.. మొత్తం 142 జిల్లాల్లోని ఉక్రెయిన్ ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలు, సైనిక విమానాశ్రయాలు, విదేశీ సైనికులు తలదాచుకున్న ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.