లైంగిక హింసపై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన ఫ్రాన్స్‌కు చెందిన జిసెల్ పెలికోట్ (73) మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా తన నగ్న ఫొటోలు, అభ్యంతరకర చిత్రాలను ఒక పుస్తక ప్రచారానికి ఉపయోగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన పబ్లిషర్, రచయితపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఫ్రాన్స్‌కు చెందిన 'టిన్‌బాడ్' అనే ప్రచురణ సంస్థ, ఒక సైకో-అనలిస్ట్ రాసిన వ్యాస సంకలనాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కేసు విచారణకు సంబంధించిన పెలికోట్ గ్రాఫిక్ ఫొటోలు, వీడియోలను ఆమె సమ్మతి లేకుండానే మీడియా సంస్థలకు పంపి ప్రచారానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఆ పుస్తకంలోని కొన్ని వాదనలు.. ఆమె ఎదుర్కొన్న వేధింపులకు పరోక్షంగా ఆమే బాధ్యురాలనే అర్థం వచ్చేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జిసెల్ పెలికోట్ పేర్కొన్నారు. తన గోప్యతకు భంగం కలిగించినందుకు, తనను మరోసారి బాధితురాలిగా నిలబెట్టినందుకు ప్రచురణకర్త, రచయితపై దావా వేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

2024లో ఫ్రాన్స్‌లో జరిగిన సంచలనాత్మక విచారణతో జిసెల్ పెలికోట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. పదేళ్లపాటు తన మాజీ భర్త డొమినిక్ పెలికోట్ తనకు మత్తుమందు ఇచ్చి, డజన్ల కొద్దీ పురుషులతో అత్యాచారం చేయించిన దారుణాన్ని ఆమె కోర్టులో ధైర్యంగా వివరించారు. 'సిగ్గుపడాల్సింది బాధితులు కాదు, నిందితులు' అంటూ తన గోప్యత హక్కును వదులుకుని, బహిరంగ విచారణకు అంగీకరించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

గతంలో కూడా తన ప్రైవసీకి భంగం కలిగించిన మీడియా సంస్థలపై పెలికోట్ విజయవంతంగా న్యాయపోరాటం చేశారు. తాజా వివాదంపై 'టిన్‌బాడ్' ప్రచురణ సంస్థ గానీ, రచయిత గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.