విదేశీ గూఢచారి సంస్థలకు దేశ రహస్యాలను లీక్ చేశాడన్న తీవ్ర ఆరోపణలపై చైనాలో ఓ ప్రభుత్వ అధికారికి మరణశిక్ష విధించారు. ఈ సంచలన విషయాన్ని చైనాకు చెందిన నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ సీక్రెట్ ప్రొటెక్షన్ (బామిగువాన్) సోషల్ మీడియా ద్వారా నవంబర్ 23న అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటన చైనా అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఏజెన్సీ కథనం ప్రకారం, శిక్ష పడిన అధికారి ఇంటిపేరు 'మా'. గతంలో విదేశాల్లో పనిచేస్తున్న సమయంలో 'కైలిన్' అనే మారుపేరు గల ఓ విదేశీ మహిళా గూఢచారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. చైనీస్ భాష నేర్చుకోవాలనే నెపంతో ఆమె 'మా'తో సాన్నిహిత్యం పెంచుకుని, ఆ తర్వాత 'టాంగ్ జెంగ్' అనే మరో నిఘా అధికారికి పరిచయం చేసింది.

కొంతకాలానికి, గతంలో 'మా' చేసిన కొన్ని నిబంధనల ఉల్లంఘనలను అడ్డుపెట్టుకుని, వారు ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. తమతో సహకరించకపోతే ఆ వివరాలను చైనా ప్రభుత్వానికి అందిస్తామని బెదిరించారు. ఈ ఒత్తిడికి లొంగిపోయిన 'మా', గూఢచర్యానికి అంగీకరించాడు. వారు ప్రత్యేకంగా ఇచ్చిన ల్యాప్‌టాప్ ద్వారా డజన్ల కొద్దీ జాతీయ రహస్యాలను విదేశీ ఏజెన్సీకి చేరవేశాడు.

ఈ సమాచారం అందించినందుకు ప్రతిఫలంగా 'మా' మిలియన్ యువాన్లకు పైగా (సుమారు 1,50,000 డాలర్లు) అందుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరం రుజువు కావడంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. జీవితాంతం రాజకీయ హక్కులను రద్దు చేయడంతో పాటు, వ్యక్తిగత ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది.

అయితే, ఈ గూఢచర్యం వెనుక ఏ దేశం ఉంది? నిందితుడి పూర్తి వివరాలు ఏంటి? శిక్ష ఎప్పుడు అమలు చేస్తారు? అనే అంశాలను చైనా ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కీలక పదవుల్లో ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఏజెన్సీలు ఇలాంటి వలలు పన్నుతాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన ద్వారా తమ దేశ పౌరులను, అధికారులను చైనా ప్రభుత్వం హెచ్చరించింది.