రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా.. హైదరాబాద్‌కు చెందిన మాజీ పోలీసు అధికారులు కార్పొరేట్ రంగంలో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు శాంతిభద్రతల పరిరక్షణలో గడించిన అనుభవం, సంక్షోభ నిర్వహణ నైపుణ్యాలు వారికి కార్పొరేట్ సంస్థల్లో భారీ జీతాలతో కూడిన ఆకర్షణీయమైన కొలువులను తెచ్చిపెడుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, సెక్యూరిటీ, విద్య, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాల్లోని ప్రముఖ కంపెనీలు రిటైర్డ్ పోలీస్ అధికారులకు నెలకు రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వేతనాలు, అదనపు అలవెన్సులు అందిస్తూ స్వాగతం పలుకుతున్నాయి.

ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. పాలనాపరమైన వ్యవహారాలు చక్కబెట్టడం, విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న ట్రాక్ రికార్డు ఉండటంతో కార్పొరేట్ కంపెనీలు వీరి సేవలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. పదవీ విరమణకు కొన్ని నెలల ముందే కంపెనీలు మంచి సర్వీస్ రికార్డు ఉన్న అధికారులను సంప్రదిస్తున్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ డీఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుతూ.. సర్వీస్ ముగియకముందే మూడు కంపెనీలు తనను సంప్రదించాయని తెలిపారు. ప్రయోజనాలను బేరీజు వేసుకుని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో చేరినట్లు వెల్లడించారు. నెగోషియేషన్లు, కౌన్సెలింగ్, సమర్థమైన కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వీరిని కార్పొరేట్ రంగానికి మరింత దగ్గర చేస్తోంది.

లీగల్ కన్సల్టెంట్లుగా, సెక్యూరిటీ హెడ్స్‌గా మాత్రమే కాకుండా.. మొండి బకాయిల వసూలు, ఆర్థిక మోసాల అడ్డుకట్ట, అంతర్గత వివాదాల పరిష్కారం, వ్యాపార విస్తరణకు తమ నెట్‌వర్క్‌ను వినియోగించడంలో వీరి నైపుణ్యాలను యాజమాన్యాలు వాడుకుంటున్నాయి. ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా అంతకంటే ఉన్నత హోదాలో రిటైరైన సీనియర్ అధికారులను పెద్ద కంపెనీలు కీలక అంశాల్లో సలహాదారులుగా నియమించుకుంటున్నాయి. మరోవైపు, యువ ఉద్యోగులతో కలిసి పనిచేయడం, కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడం వల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే ఒంటరితనాన్ని దూరం చేసుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్‌ను ఉత్సాహంగా కొనసాగించే అవకాశం వీరికి లభిస్తోంది.