ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, కొత్త నియామకాల నిలిపివేత అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, డేటాబ్రిక్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు వచ్చే ఏడాది భారతదేశంలో క్యాంపస్ నియామకాలను నిలిపివేయవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో టెక్ పరిశ్రమలో మరో భారీ ఉద్యోగాల కోత ముప్పు పొంచి ఉందా? అనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

ప్రత్యూష్ రాయ్ అనే టెక్ నిపుణుడు ఎక్స్ వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ... టెక్ పరిశ్రమలో తీవ్ర మందగమనం కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత ఆయన స్పష్టత ఇస్తూ, ఇది ప్రపంచవ్యాప్త నిర్ణయం కాదని, ప్రధానంగా భారతీయ ఐఐటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లోని క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కావచ్చని పేర్కొన్నారు.

మరోవైపు, ప్రముఖ వర్క్‌ప్లేస్ ఫోరమ్ 'బ్లైండ్'లోనూ ఉద్యోగుల తొలగింపులపై చర్చలు మొదలయ్యాయి. భారత్‌లోని గూగుల్ కార్యాలయాల్లో అంతర్గతంగా రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేశారని, కొందరు ఉద్యోగులకు 24 గంటల గడువు ఇచ్చి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని కొందరు యూజర్లు పోస్టులు పెట్టారు. పనితీరు మెరుగుదల పథకం (పీఐపీ) పేరుతో మరికొందరిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో స్వచ్ఛంద నిష్క్రమణ లేదా లేఆఫ్స్ ఉండవచ్చని ఈ పోస్టులు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో, ఎంట్రీ-లెవల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై కొత్త గ్రాడ్యుయేట్లలో ఆందోళన పెరుగుతోంది. అయితే, ఇవన్నీ కేవలం సోషల్ మీడియా వేదికల్లోని ఉద్యోగుల పోస్టులు, అంతర్గత చర్చల ఆధారంగా వస్తున్న వార్తలు మాత్రమే. భారత్‌లో క్యాంపస్ హైరింగ్ నిలిపివేతపై గానీ, తాజా లేఆఫ్స్‌పై గానీ అటు గూగుల్, ఇటు మైక్రోసాఫ్ట్ సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.