చైనా సహకారంతో పాకిస్థాన్ తన మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది. చైనాకు చెందిన ‘షెన్‌జౌ-24’ మిషన్ ద్వారా పాక్ వ్యోమగామి 'తియాంగాంగ్' అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి రిహార్సల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. లాంచ్ తేదీని చైనా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, త్వరలోనే ఈ ప్రయోగం జరగనుంది.

ఈ మిషన్ సెండ్-ఆఫ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్రణాళికా శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ చైనా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్ తొలి వ్యోమగామి అంతరిక్ష యాత్ర దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ మిషన్ కోసం పాక్ సైన్యానికి చెందిన పైలట్లు మహమ్మద్ జీషన్ అలీ, ఖుర్రమ్ దావూద్ చైనాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యోమగామిగా వెళతారు.

చైనా ప్రయోగించే లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ఈ వ్యోమగామి నింగిలోకి వెళ్లనున్నారు. చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను సందర్శించనున్న తొలి విదేశీ వ్యోమగామి కూడా ఈయనే కావడం విశేషం. అక్కడ పేలోడ్ స్పెషలిస్ట్‌గా దాదాపు ఒక వారం పాటు పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రస్తుతం అక్కడే డాక్ అయి ఉన్న షెన్‌జౌ-23 నౌక ద్వారా భూమికి తిరిగి వస్తారు. గతంలో పాకిస్థాన్‌కు చెందిన నమీరా సలీమ్ స్పేస్ టూరిజంలో భాగంగా సబ్-ఆర్బిటల్ యాత్ర చేసినప్పటికీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో కక్ష్యలోకి వెళుతున్న తొలి అధికారిక వ్యోమగామి మిషన్ ఇదే.