హైదరాబాద్‌లో ‘గోల్డ్ మ్యాన్‌’గా పేరుగాంచిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్‌కు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గట్టి షాక్ ఇచ్చింది. బినామీ ఆస్తుల నిరోధక విభాగం రంగంలోకి దిగి, రాయదుర్గంలో ఉన్న ఆయనకు చెందిన ఓ భారీ అపార్ట్‌మెంట్ భవనాన్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది. 

ఈ ఆస్తి చిన్న గౌడ్ బావమరిది ప్రణయ్ గౌడ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, దాని అసలు లబ్ధిదారుడు చిన్న గౌడే అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆ భవనాన్ని, దాని ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని కూడా ఫ్రీజ్ చేశారు. తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఆస్తిని అమ్మడం, బదిలీ చేయడం లేదా ఇతరులకు అప్పగించడంపై నిషేధం విధించారు.

ఐటీ శాఖ దర్యాప్తు ప్రకారం.. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలైలో కొనుగోలు చేశారు. పత్రాల్లో రూ.26.70 లక్షలుగా విలువ చూపగా, ఈ నిధులన్నీ తన బావ చిన్న గౌడ్ సమకూర్చినట్లు ప్రణయ్ గౌడ్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. 

స్థలం కొనుగోలు సమయంలో తాను విద్యార్థినని, ఎలాంటి ఆదాయం లేదని కూడా ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఆ స్థలంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి అవసరమైన డబ్బును కూడా చిన్న గౌడే సమకూర్చినట్లు ప్రణయ్ స్వచ్ఛంద వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఈ అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.3.20 లక్షల అద్దె వస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ అద్దె డబ్బులు ఆస్తి యజమానిగా ఉన్న ప్రణయ్ ఖాతాలోకి కాకుండా, చిన్న గౌడ్ భార్య బ్యాంకు ఖాతాకు, అక్కడి నుంచి చిన్న గౌడ్ ఖాతాలకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. 

దీంతో ప్రణయ్‌ను బినామీదారుడిగా, చిన్న గౌడ్‌ను అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న తాత్కాలిక అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988 కింద ఈ చర్యలు తీసుకున్నారు.

గతంలో చిన్న గౌడ్ పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఐటీ శాఖ ఆయనపై దృష్టి సారించింది. ఏప్రిల్‌లో సోదాలు నిర్వహించి, అతని వద్ద ఉన్న 900 గ్రాముల బంగారంలో, 700 గ్రాములకు సరైన లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. 

తన ఐటీ రిటర్నుల్లో కేవలం రూ.4 లక్షల ఆదాయం మాత్రమే చూపిన చిన్న గౌడ్ వద్ద ఇంతటి ఆస్తులు ఎలా సమకూరాయనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా బినామీ ఆస్తిని అటాచ్ చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.