బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని సూటి ప్రశ్న సంధించారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే, ఆమె రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్‌' ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన ఎందుకు లేదని నిలదీశారు. ‘తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే’ అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదని, అది తెలంగాణ ప్రజల పోరాట ఫలితమని కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు తాను చేపట్టిన పాదయాత్రకు 15 ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు.

ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు ఆరు రోజుల పాటు సాగిన ఆ పాదయాత్ర తనకు ఓ గొప్ప జ్ఞాపకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ చరిత్రను ప్రస్తావిస్తూ, సోనియా గాంధీపై, కాంగ్రెస్‌పై ఆయన ఈ విమర్శలు చేసినట్లు స్పష్టమవుతోంది.