తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం అనే ప్రాతిపదికన ఏర్పాటయిందని, అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలకు పదవుల తాలూకు హుందాతనం, గౌరవం తెలియకుండా పోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బాడీగార్డులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు సైతం రాహుల్ గాంధీ నడుపుతున్న బైక్ వెనుక నౌకర్ల మాదిరిగా పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నాడు గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ నిర్వహించిన బైక్ ర్యాలీ దృశ్యాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కేటీఆర్ తప్పుపట్టారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో అమిత్ షా కాళ్లకు మొక్కడం, ఆయన చెప్పులు మోయడం వంటి చర్యలను గుర్తుచేస్తూ, ఇది అత్యంత సిగ్గుచేటైన, అనుచితమైన ప్రవర్తన అని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ రెండు జాతీయ పార్టీలు ఏనాడూ గౌరవించలేవని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాహుల్ గాంధీ బైక్ వెనుక తాను పరిగెత్తడంపై టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. తాను కూడా బైక్‌పైనే వెళుతున్న క్రమంలో వాహనం స్కిడ్ అయ్యిందని, రాహుల్ గాంధీ తనను గమనించి పక్కకు పిలిచారని తెలిపారు. తాను శారీరకంగా ఫిట్‌గా ఉన్నందునే పక్కనే పరిగెత్తుకుంటూ వెళ్లానని, రాహుల్ గాంధీ వెంట అలా పరిగెత్తడం తన అదృష్టంగా భావిస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

మరోవైపు, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొనడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని నీతులు చెబితే సరిపోదని, ముందుగా రాజ్యాంగ విలువలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికింది. ఏ హోదాలో, ఏ ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్నారని ప్రశ్నించింది. రాహుల్ గాంధీ శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ ప్యాకేజీని ప్రకటించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ ముగింపు సభలో ప్రసంగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ ప్రశ్నలను సంధించింది.