తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరిగ్గా మూడేళ్ల క్రితం విడుదల చేసిన మేనిఫెస్టోను మోసాల చిట్టాగా మార్చేశారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన 'అభయహస్తం' కాస్తా, నేడు ప్రజలకు ఏమీ ఇవ్వని 'మొండిహస్తం', 'శూన్యహస్తం'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

మల్లికార్జున ఖర్గే సమక్షంలో మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ వంటి పవిత్ర గ్రంథాలతో సమానంగా భావించి ప్రతి హామీని అమలు చేస్తామని నాడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారని హరీశ్‌రావు అన్నారు. మూడేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఆరోపించారు. ఓట్లేసిన ప్రజలనే కాకుండా ప్రమాణం చేసిన పవిత్ర గ్రంథాలను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో రేవంత్ రెడ్డి, ఖర్గే, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తొలి మంత్రివర్గ సమావేశంలోనే 'ఆరు గ్యారెంటీ'లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పటివరకు 38 క్యాబినెట్ భేటీలు నిర్వహించినా ఎందుకు ఆ పని చేయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. హామీలను ఎగ్గొట్టి ప్రజలను వంచించడమే కాంగ్రెస్ ఏకైక విజయమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.