ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో తాజాగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, ఏకగ్రీవాల ఆవశ్యకత తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇటీవల పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం చేపట్టిన రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన ఆమోదమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఈ ఏకపక్ష ప్రజాభిప్రాయాన్ని ప్రతిపక్ష వైసీపీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. పార్టీ ప్రాతిపదికన జరిగిన పోరు ముగిసిందని, ఇక గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ అదే విజయ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

పంచాయతీలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని, కాబట్టి అక్కడ రాజకీయ ఘర్షణలకు తావులేకుండా ఏకగ్రీవాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాలు ఏకగ్రీవమైతే ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక నజరానాలు అభివృద్ధి పనులకు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. గతంలో కనీస నజరానా రూ.5 లక్షలుగా ఉంటే దానిని ఇప్పుడు రూ.15 లక్షలకు, గరిష్ఠ నజరానాను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహకం అందుతుందని ఆయన గుర్తుచేశారు.

గ్రామ స్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు తీవ్ర పట్టుదలతో ఉంటారని, అటువంటి చోట్ల నేతలతో సంప్రదింపులు జరపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల మధ్య పంతాలు, వ్యక్తిగత పట్టింపులకు తావులేకుండా ఐక్యతను ప్రదర్శించాలని సూచించారు. జడ్పీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యర్థి పార్టీ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొన్న సీఎం, అదే సమయంలో తమ పార్టీలోని నేతలే రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ, గ్రామాల సమగ్ర వికాసానికి ఏకగ్రీవాలే మార్గమని ప్రజలను ఒప్పించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.