భారత రైల్వే సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, నిబద్ధతను చాటుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ సింగపూర్ పర్యాటకుడు పొరపాటున మర్చిపోయిన బ్యాగును గుర్తించి, అందులోని లక్షల రూపాయల భారత, విదేశీ కరెన్సీతో సహా సురక్షితంగా అతనికి అప్పగించారు. ఈ ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. సిబ్బంది సత్వర స్పందన, నిజాయతీ పట్ల ఆ పర్యాటకుడు ప్రశంసల వర్షం కురిపించారు.

వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌కు చెందిన లిమ్ వెంగ్ షాంగ్ అనే పర్యాటకుడు శుక్రవారం న్యూఢిల్లీ నుంచి వారణాసికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 22416)లో ప్రయాణించారు. వారణాసి జంక్షన్‌లో రైలు దిగే క్రమంలో తన వెంట ఉన్న ఓ నలుపు రంగు బ్యాగును పొరపాటున కోచ్‌లోనే మర్చిపోయారు. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత రైలును నిర్వహణ కోసం యార్డుకు తరలించారు.

యార్డులో అటెండెంట్ అనూప్ కుమార్, క్లీనింగ్ సిబ్బంది కరణ్ సింగ్ రైలులో రొటీన్ క్లీనింగ్ చేస్తుండగా, E1 కోచ్‌లోని 35వ నంబర్ సీటు వద్ద ఓ బ్యాగ్ పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) అధికారులకు సమాచారం అందించారు. ఆర్‌పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ చరణ్ సింగ్ తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ (అవుట్‌డోర్) వకీల్ సింగ్ సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా, అందులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు.

బ్యాగులో రూ.2,11,000 భారత కరెన్సీతో పాటు 1,000 అమెరికన్ డాలర్లు, 1,22,000 శ్రీలంక రూపాయలు, 66 సింగపూర్ డాలర్లు ఉన్నాయి. ఇంతలో తన బ్యాగ్ పోయిన విషయాన్ని గ్రహించిన లిమ్ వెంగ్ షాంగ్, తన గైడ్‌తో కలిసి తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారులను సంప్రదించి, తన బ్యాగ్ వివరాలను, అందులోని వస్తువుల గురించి తెలిపారు. 

ఆ వివరాలు బ్యాగులో లభించిన వాటితో సరిపోలడంతో, అతని గుర్తింపును నిర్ధారించుకుని అధికారులు బ్యాగును అప్పగించారు. స్టేషన్ డైరెక్టర్ అర్పిత్ గుప్తా శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన వస్తువులు అన్నీ సురక్షితంగా తిరిగి చేరడంతో లిమ్ వెంగ్ షాంగ్.. భారత రైల్వే సిబ్బంది నిజాయతీని, తక్షణ స్పందనను మనస్ఫూర్తిగా అభినందించారు.