ఆంధ్రప్రదేశ్‌లోని భూ యజమానులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, సవరించిన కొత్త అడంగల్ పత్రాలను నేరుగా యజమానుల నివాసాలకే పోస్టు ద్వారా పంపాలని నిశ్చయించింది. ఈ నిర్ణయంతో భూ యజమానులకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.

ఈ మేరకు భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ మధ్య ఈ పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రస్తుత నెల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్-కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 మధ్య సుమారు 31,000 లావాదేవీ (ట్రాన్సాక్షన్), సవరణ (కరెక్షన్) మ్యుటేషన్ దరఖాస్తులు నమోదయ్యాయి. వీరికి సంబంధించిన సవరించిన అడంగల్ ప్రతులను నవంబర్ 26 నుంచి 30వ తేదీ లోపు పంపిణీ చేయనున్నారు.

తహసీల్దార్ ఆమోదం లభించినప్పటికీ, అడంగల్ ప్రతులు అందడంలో జాప్యం జరుగుతోందని 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్' (ఐవీఆర్ఎస్) ద్వారా అందిన ఫీడ్‌బ్యాక్‌లో 40 నుంచి 50 శాతం మంది యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

పంపిణీలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా, మ్యుటేషన్ దరఖాస్తుల్లో శాశ్వత చిరునామాతో పాటు ప్రస్తుత సమాచార మార్పిడి (కరెస్పాండెన్స్) చిరునామాను కూడా తప్పనిసరిగా నమోదు చేయనున్నారు. ఈ నూతన విధానం ద్వారా రెవెన్యూ సేవల్లో వేగం, పారదర్శకత మెరుగుపడతాయని అధికారులు ఆశిస్తున్నారు.